దళితులపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ లేదు.. దళితుల ఓట్ల కోసమే రూ.10 లక్షలు : ఈటల రాజేందర్‌

దళితులపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ లేదు.. దళితుల ఓట్ల కోసమే రూ.10 లక్షలు  : ఈటల రాజేందర్‌
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ నేత ఈటల రాజేందర్.. అధికార పార్టీపైనా విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ నేత ఈటల రాజేందర్.. అధికార పార్టీపైనా విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. తాను వాస్తవంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని.. టీఆర్ఎస్సే నన్ను రాజీనామా చేసేలా ఒత్తిడి చేసిందని ఆరోపించారు. పాదయాత్ర నాలుగో రోజు.. జమ్మికుంట, ఇల్లందుకుంట మండలాల్లో పర్యటించిన ఈటల.. టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పైనా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారంతా బజార్‌లో పడ్డారని చెప్పారు. ఉద్యమకారులను అవమానించిన వారంతా ఇపుడు కేసీఆర్ పక్కన ఉన్నారన్నారు. దళితులపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ లేదని.. దళితుల ఓట్ల కోసమే పది లక్షలు ఇస్తున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ విధానాలపై మండిపడిన ఈటల రాజేందర్.. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. మూడేళ్లుగా ఒక్కసారైనా కొత్త పింఛన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసమే హుజురాబాద్‌లో 11 వేల మందికి కొత్త పింఛన్లు, తెల్లరేషన్ కార్డులు ఇస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా.. ఓట్ల కోసం ప్రలోభాలకు గురిచేసినా.. హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు తనను కచ్చితంగా ఆశీర్వదిస్తారని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు.. హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ పాదయాత్ర చేపట్టగా.. జమ్మికుంట మండల ప్రజలు ఆయనకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బిజిగిరి షరీఫ్‌ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న ఈటల.. దర్గాను సందర్శించి... ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story