Top

హుజురాబాద్‌ ప్రచారంలో ఈటల రాజేందర్ దూకుడు..!

హుజురాబాద్. ఇటు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌.. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన నియోజకవర్గం.

హుజురాబాద్‌ ప్రచారంలో ఈటల రాజేందర్ దూకుడు..!
X

హుజురాబాద్. ఇటు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌.. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన నియోజకవర్గం. ఉప ఎన్నిక ఎప్పుడనేది ఇంకా ఎన్నికల షెడ్యూల్ ఖరారు కాకముందే హుజురాబాద్ తెలంగాణలో కాకరేపుతోంది. గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో ముందే ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. అయితే అన్ని పార్టీల కంటే ఈటల రాజేందర్ ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. జులై 19 నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన ఈటల.. టీఆర్ఎస్ పార్టీపైనా, సీఎం కేసీఆర్‌పైన మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇన్నాళ్లు హుజురాబాద్‌ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూనే.. అధికార పార్టీ తనపై చేస్తున్న కుట్రలను, ఇబ్బందులను చెప్తున్నారు.

ఇక పాదయాత్ర మూడురోజు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటల రాజేందర్.. మరోసారి టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కమలాపురం మండలం వంగపల్లిలో బస చేస్తే రాత్రి కరెంట్ తీశారని ఆరోపించారు. తాము ఎక్కడ పర్యటిస్తే అక్కడ కరెంటు తీసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత నీచంగా, నికృష్టంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందో ప్రజలు గమనించాలన్నారు. టీఆర్ఎస్ చిల్లర వేషాలను హుజురాబాద్ ప్రజలు సహించరన్నారు. అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్న టీఆర్ఎస్ నేతల అహంకారాన్ని ఓడగొట్టే శక్తి హుజురాబాద్ ప్రజలకు మాత్రమే ఉందన్నారు. ఇన్నేళ్లలో తాను తెలిసి ఏనాడూ తప్పు చేయలేదన్నారు ఈటల. ఒక్క కరోనా సమయంలో తప్ప ఏనాడూ నియోజకవర్గ ప్రజలకు దూరంగా లేనని తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో అనేక రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించానని గుర్తుచేశారు. ధర్మం పాతర వేయవద్దనే వర్షంలో కూడా పాదయాత్ర చేస్తున్నానని ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.

అంతకుముందు.. పాదయాత్ర రెండో రోజు ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ.. తనను చంపేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. మొత్తానికి హుజురాబాద్‌లో గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఈటల రాజేందర్.. అన్ని పార్టీల కంటే ప్రచారంలో దూకుడు పెంచారు. గ్రామగ్రామాన పర్యటించడంతో పాటు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని.. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలను ప్రజల్లో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES