ED: కల్వకుంట్ల కవిత అరెస్ట్‌

ED: కల్వకుంట్ల కవిత అరెస్ట్‌
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్‌ చేసిన ఈడీ అధికారులు

ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సుదీర్ఘ కాలంగా విచారణ జరుపుతున్న ఈడీ అందులో భాగంగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది. తనిఖీలు చేసిన 8 మంది ఈడీ అధికారులు..కవితను పలు అంశాలపై ప్రశ్నించారు. అనంతరం ఆమెను అరెస్టు చేశారు. అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీల మెమోను కవితకు అందించారు. తర్వాత ఆమెను తమ వెంట తీసుకెళ్లిన ED అధికారులు..శంషాబాద్‌ నుంచి విమానంలో దిల్లీకి తీసుకెళ్లారు. మరోవైపు కవిత అరెస్టుతో ఆమె నివాసం వద్ద బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేంద్రం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కవితను అరెస్టు చేశారని విమర్శించారు.


మరోవైపు కవిత అరెస్టుపై ఈడీ అధికారులతో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్య నిర్వాహక అధ్యక్షుడు KTR వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారన్న ప్రశ్నించిన ఆయన అరెస్టు చేయబోమని కోర్టులో చెప్పి ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన మాటను ఎలా తప్పుతారని నిలదీసిన KTR.......కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కావాలనే శుక్రవారం వచ్చారన్న కేటీఆర్ సోదాల తర్వాత కూడా ఇంట్లోకి రావద్దన్న అధికారులపై మండిపడ్డారు. ఈడీ అక్రమ అరెస్ట్ ను న్యాయపరంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కొంటామని కవిత కుటుంబసభ్యులు తెలిపారు. అరెస్టును అడ్డుకోవద్దని, పార్టీ కార్యకర్తలు సంయమనంతో వ్యహరించాలని హరీశ్ రావు, కేటీఆర్ కోరారు. అటు సుప్రీంకోర్టుకు ఇచ్చిన మెమోను ఈడీ ఉల్లంఘించిందని కవిత తరఫు న్యాయవాదులు తెలిపారు. CRPC సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు. 2022 డిసెంబరులో అప్పటి విచారణ అధికారి ఇదే తరహా నోటీసు..సెక్షన్ 160 కింద ఇచ్చారన్నారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు, ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ఈనెల 19న సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ ఉందన్నారు. ఈలోపే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు.


అరెస్టు సమయంలో పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన కవిత ఇలాంటి అణిచివేతలు, కక్షసాధింపులు ఎన్ని జరిగినా.... ఎదుర్కొంటామన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. రాజకీయ కుట్రలో భాగంగానే కవిత అరెస్టు జరిగిందని బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ దుర్మార్గ చర్యపై బీఆర్‌ఎస్‌ న్యాయపరంగా పోరాడుతుందని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో లబ్ది కోసం బీజేపీ, కాంగ్రెస్ చేసిన కుటిల ప్రయత్నాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. నేడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపడతామని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story