MEDIGADDA: మేడిగడ్డ కుంగడంపై కేంద్రం సీరియస్‌

MEDIGADDA: మేడిగడ్డ కుంగడంపై కేంద్రం సీరియస్‌
ఆరుగురు సభ్యులతో కమిటీ నియామకం... నేడు పరిశీలన

కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్యారేజ్ పియర్ కుంగడాన్ని కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాసిన లేఖపై స్పందించిన జలశక్తి శాఖ బ్యారేజీ సామర్థ్యం పరీక్షించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచే సింది. ఈ మేరకు ఛైర్మన్ తోపాటు సభ్యులు హైదరాబాద్ వచ్చి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. నేడు మేడిగడ్డ జలాశయాన్ని కమిటీ సభ్యులు పరిశీలించి కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందిస్తారు. మరోవైపు బ్యారేజీ కుంగిన ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నాణ్యతపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


మేడిగడ్డ బ్యారేజ్ అట్టర్ ఫ్లాప్ అని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌‌ రెడ్డి మండిపడ్డారు. గతంలో వరదలు వచ్చినపుడు మేడిగడ్డ మోటార్లు కొట్టుకుపోయాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవటం బాధాకరమన్నారు ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి అందరికి ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ఇంజనీరింగ్ మార్వెల్, నేనే ఇంజనీర్, రీ డిజైనర్ అని కేసీఆర్ చెప్పుకున్నరని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు కేసీఆర్ మానసపుత్రిక అని, డ్రీమ్ ప్రాజెక్టు అని బీఆర్ఎస్‌‌ నేతలు గొప్పలు చెప్పుకున్నరని.. ఇప్పుడు మేడిగడ్డ బ్రిడ్జి కుంగడంతో కేసీఆర్ బొక్కబోర్లా పడ్డారని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటంపై అనుమానాలున్నాయని, సమగ్రమైన దర్యాప్తు జరపాలని కిషన్‌‌రెడ్డి డిమాండ్ చేశారు.


: కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ.. నాణ్యత ప్రమాణాల పట్ల లేనందునే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. . నాణ్యత ప్రమాణాలను పాటించనందు వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు.

మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగి కూలిపోవడానికి సిద్ధంగా ఉందని అందుకు బాధ్యులైన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో రఘునాథపాలెం మండలం నుంచి నలుగురు సర్పంచ్ లు, ఒక ఉపసర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు.. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నేనే కాళేశ్వరం కట్టాను అని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ తన అవినీతిని ఒప్పుకోవాలని పొంగులేటి నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story