TRSLP Meeting: కేంద్రంపై మరోసారి యుద్ధం తప్పదంటున్న కేసీఆర్..

TRSLP Meeting: కేంద్రంపై మరోసారి యుద్ధం తప్పదంటున్న కేసీఆర్..
TRSLP Meeting: తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

TRSLP Meeting: తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. యాసంగి వరిని పంజాబ్‌ నుంచి కొన్నట్టే కేంద్రం కొనాలని డిమాండ్‌ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, మార్కెట్‌ కమిటీల తీర్మానాలు కేంద్రానికి పంపుతామన్నారు కేసీఆర్. ధాన్యం సేకరణలో ఒకే పాలసీ ఉండాలన్నారు.

ఈనెల 25 నుంచి టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్తుందని.. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ పోరాటం ఆషామాషీగా ఉండదని.. యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రధాని మోదీకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నానని.. తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దన్నారు.

ముందస్తు ఎన్నికల ప్రచారంపైనా సీఎం కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. గత ఎన్నికల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడే వారికి మతి లేదని ఫైరయ్యారు. ఈ సారి 95 నుంచి 105 స్థానాలు టీఆర్‌ఎస్‌వేనన్నారు. 30 స్థానాల్లో సర్వే చేస్తే 29 తమకే వస్తాయని సర్వే రిపోర్ట్‌ వచ్చిందన్నారు.

ప్రశాంత్‌ కిశోర్‌ ఏడేళ్లుగా తనకు మంచి స్నేహితుడన్నారు కేసీఆర్‌. ప్రజల పల్స్‌ పీకే పట్టుకుంటారన్నారు. దేశంలో మార్పు తెచ్చేందుకు పీకే తనతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. దేశ రాజకీయాలపై ఆయనకు అవగాహన ఉందన్నారు. తన ఆహ్వానం మేరకే వచ్చి పనిచేస్తున్నారన్నారు. యూపీలో బీజేపీ సీట్లు తగ్గాయని.. ఇది దేనికి సంకేతమో ఆలోచించుకోవాలన్నారు.

పంజాబ్‌లో రైతుల ఆక్రోశం కన్పించిందని.. బీజేపీని తరిమికొట్టారన్నారు. దేశంలో బీజేపీ సర్కార్‌ కొత్త ప్రాజెక్టు కట్టలేదు.. కొత్త ఫ్యాక్టరీ పెట్టలేదన్నారు. నిరుద్యోగ రేటు బాగా పెరిగిందని.. ప్రభుత్వ రంగ సంస్థల్ని కారుచౌకగా కట్టబెడుతున్నారని ఫైరయ్యారు. ఇరిగేషన్‌ ఫైల్స్, ఎకనామిక్‌ ఫైల్స్‌ ఉంటాయి.. ఈ కశ్మీర్‌ ఫైల్స్‌ ఏంటని ప్రశ్నించారు కేసీఆర్‌. విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు కరెక్ట్‌ కాదన్నారు. ఓట్లు దండుకునే కార్యక్రమం చేస్తున్నారని కశ్మీరీ పండిట్లే చెబుతున్నారన్నారు.

గతంలో యూపీఏ కన్నా బీజేపీ దుర్మార్గమైన పాలన చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్యాకప్‌ చేయాల్సిందేనన్నారు కేసీఆర్. ఇక.. ఈడీ దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు కేసీఆర్‌. ఐటీ, ఈడీ దాడులు చేస్తారని ప్రచారం జరుగుతోందన్నారు. ఈ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు భయపడబోమన్నారు. ఇలాంటి పనులు అన్ని చోట్ల వర్కవుట్‌ కావన్నారు.

Tags

Read MoreRead Less
Next Story