Files Missing :పశుసంవర్థకశాఖలో ఫైల్స్ మాయం

Files Missing :పశుసంవర్థకశాఖలో ఫైల్స్ మాయం
తలసాని ఓఎస్డీపై కేసు నమోదు, పూర్తిగా నిరాధారమన్న మాజీ ఓఎస్డీ

ప్రభుత్వకార్యాలయాల్లో వరుసగా కీలకదస్త్రాలు మాయమవుతున్న ఘటనలు సంచలనం రేపుతున్నాయి. పర్యాటక భవన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కొన్ని దస్త్రాలు కాలిబూడిదకాగా మాజీ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ దగ్గర పనిచేసిన OSD కార్యాలయంలో కొన్ని దస్త్రాలు కనిపించకుండా పోయాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. విద్య పరిశోధన శిక్షణ సంస్థలో ఫైల్స్‌ చోరీకి యత్నం జరిగింది. ఆయా ఘటనల పై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్‌ నాయకులు డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని వద్ద పనిచేసిన OSD కళ్యాణ్‌ కార్యాలయంలో కొన్నిదస్త్రాలు మాయమయ్యాయి. కిటీకీ గ్రిల్స్‌ తొలగించిన దుండగులు ఫైల్స్‌ ఎత్తుకెళ్లినట్లు కార్యాలయం కాపాలాదారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాసబ్‌ట్యాంక్‌ పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ OSD కల్యాణ్‌ ఛాంబర్‌ ఉంది. శుక్రవారం సాయంత్రం ఐదున్నర సమయంలో కిటికీ గ్రిల్స్‌ తొలగించిన కొందరు కార్యాలయంలోకి ప్రవేశించారు. అక్కడ నుంచి కీలకపత్రాలు కంప్యూటర్లలోని హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లినట్టు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు దుమారం రేపాయి. రాత్రి వాచ్‌మెన్‌ తాళాలు తీసి ఉండటంతో లోపలికి వెళ్లిన వాచ్‌మెన్‌ పైళ్లు, కంప్యూటర్లు, బీరువాలు చిందరవందరగాపడిఉన్నట్లు గుర్తించాడు.అయితే అక్కడ నుంచి పైల్స్‌ అన్ని సచివాలయానికి చేరవేశారని దస్త్రాలు మాయం కాలేదని ఓఎస్డీ కల్యాణ్‌ చెబుతున్నాడు. ఈ వ్యవహారంలో కొందరిపై కేసు నమోదు చేసిన పోలీసులు... వారిని విచారించినట్లు సమాచారం .

కొత్తప్రభుత్వ ఏర్పాటుతో మాజీమంత్రులు, ప్రజాప్రతినిధులు, OSDల కార్యాలయాల్లోకిఆగంతుకులు ప్రవేశించి అక్కడి నుంచి కీలకపత్రాలు మాయం చేస్తున్నారు. ఇటీవలే హిమాయత్‌నగర్‌లోని పర్యాటక అభివృద్ధి కార్యాలయంలో అగ్నిప్రమాదం, రవీంద్రభారతి నుంచి ఫర్నీచర్‌ అక్రమ తరలింపు సహా పశు సంవర్ధకశాఖలో కీలకపత్రాలు మాయంకావడం..సాంకేతికవిద్యామండలి కార్యాలయంలోకి ప్రవేశించిన ఇద్దరు కొన్ని పత్రాలతో పారిపోతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్‌ అదే ఆవరణలో ఉండడం, మీడియా రావటంతో ఆగంతుకులు హడావుడిగా వెళ్లిపోవటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్, సామాజిక మాధ్యమాల్లో లభించిన వివరాల ఆధారంగా అనుమానితులను గుర్తించే పనిలోపడ్డారు. ఉన్నతాధికారుల అనుమతిలేకుండా రాత్రివేళకార్యాలయంలోకి ప్రవేశించే వారిపై చర్యలు తప్పవని పోలీసులు స్పష్టంచేస్తున్నారు.

దస్త్రాల మాయం వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిరంజన్‌ DGPకి లేఖ రాశారు. ఆయా ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story