TS: ప్రజాపాలనకు భారీ స్పందన

TS: ప్రజాపాలనకు భారీ స్పందన
మొదటిరోజే 7 లక్షల 46 వేల 416 దరఖాస్తులు...

తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి తొలిరోజు భారీ స్పందన వచ్చింది. ఐదు గ్యారెంటీ పథకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే... 7 లక్షల 46 వేల 414 దరఖాస్తులు అందాయి. పథకాల నిబంధనలపై అయోమయంతో కొంత గందరగోళం ఏర్పడింది. యంత్రాంగం నుంచి సరైన సమాచారం రాక... పలు ప్రాంతాల్లో దరఖాస్తులు బయట కొనుగోలు చేశారు. మొదటి రోజు సదస్సులు విజయవంతం అయ్యాయన్న CS శాంతికుమారి.. దరఖాస్తులు ఉచితంగా ఇస్తామని.. బయట అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలన సదస్సులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. ఐదు గ్యారంటీ పథకాల కోసం నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల 46 వేల 414 దరఖాస్తులు వచ్చాయి. నిన్న 2 వేల 50 పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లోని 2 వేల 10 వార్డుల్లో సదస్సులు జరిగాయి. మొత్తం 17 లక్షల 24 వేల 557 కుటుంబాల పరిధిలో సదస్సులు నిర్వహించగా.. 7 లక్షల 46 వేల 414 దరఖాస్తులు వచ్చాయి. GHMCలో లక్షా 98 వేలు, రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 2 లక్షల 59 వేల 694 దరఖాస్తులు అందాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని వార్డులు డివిజన్లలో సదస్సులు జరిగాయి. ఉపముఖ్యమంత్రి, మంత్రులు వివిధ ప్రాంతాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లోనూ తొలిరోజు దరఖాస్తులు పోటెత్తాయి. బల్దియాలోని 2 లక్షల 39 వేల 739 కుటుంబాల పరిధిలో సదస్సులు నిర్వహించగా.. లక్షా 98 వేల దరఖాస్తులు వచ్చాయి. అందులో అభయహస్తం గ్యారంటీల పథకాల కోసం లక్షా 73 వేల 262 దరఖాస్తులు రాగా 20 వేల 714 మంది ఇతర అవసరాల కోసం సమర్పించారు. ఛార్మినార్ జోన్‌లో 43 వేల798 ఖైరతాబాద్ జోన్‌లో 28 వేల 68, కూకట్ పల్లి జోన్‌లో 39 వేల 355, LBనగర్ జోన్‌లో 31 వేల513, సికింద్రాబాద్ జోన్‌లో 31 వేల 414, శేరిలింగంపల్లి జోన్‌లో 19 వేల 828 దరఖాస్తులు అందినట్లు GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ వెల్లడించారు. తెలంగాణలోని 141 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో 2 వేల 358 వార్డుసభలు నిర్వహించారు. ప్రజాపాలన కోసం పురపాలక కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రజాపాలనపై ప్రజలు, నగర పాలక సంస్థల అనుమానాలు నివృత్తి చేసేందుకు హైదరాబాద్‌లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలోనూ ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఫిర్జాదిగూడ, బోడుప్పల్, పోచారంలో ప్రజా సదస్సులను పురపాలక శాఖ డైరెక్టర్ హరిచందన పరిశీలించారు.

Tags

Read MoreRead Less
Next Story