Hyderabad Metro: పాతబస్తీ మెట్రోకు నేడే శంకుస్థాపన

Hyderabad Metro: పాతబస్తీ మెట్రోకు నేడే  శంకుస్థాపన
మూడేళ్లలో పూర్తి చేస్తామన్న అధికారులు

ఇక నుంచి చార్మినార్‌కు వెళ్లాలంటే..ఆర్టీసీ బస్సే ఎక్కాలా ఏంటీ..? మెట్రోరైలులో కూడా పోవచ్చంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ దిశగా పాతబస్తీకి మెట్రోరైలును తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది. మెట్రోరైలు విస్తరణలో భాగంగా రెండో దశలో MGBS నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైలు మార్గాన్ని ప్రభుత్వం నిర్మించోతోంది. దాదాపు 2 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొత్తం 5.5 కిలోమీటర్ల పొడవునా ఏడాదిలోగా మెట్రోమార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్‌ సంకల్పించుకుంది. ఈ నిర్మాణం పూర్తైతే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా పాతబస్తీకి చేరుకోవచ్చు.

పాతబస్తీకి రానున్న మెట్రోలైను ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురానీహవేలి, ఏత్‌బార్ చౌక్, అలిజాకోట్ల, మీర్ మొనిస్ దాయరా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా చేరుకుంటుంది. 5.5 కిలోమీటర్లున్న ఈ మార్గంలో 4 స్టేషన్లను నిర్మించను న్నారు. సాలార్‌జంగ్ మ్యూజియం, మొఘల్‌పురా వద్ద చార్మినార్ స్టేషన్, షంషీర్ గంజ్ వద్ద శాలిబండ స్టేషన్, ఫలక్ నుమా ఫ్యాలెస్ సమీపంలో ఫలక్ నుమా స్టేషన్లు రానున్నాయి. ఐతే ఈ స్టేషన్లు చారిత్రక కట్టడాలకు 500 మీటర్ల దూరంలో ఉండనున్నాయి. మెట్రోతో దాదాపు 1100 కట్టడాలు తొలగించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో 100 అడుగులు, స్టేషన్ ఉన్న ప్రాంతంలో 120 అడుగుల మేర రోడ్డు విస్తరించాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణతో కలిపి ప్రాజెక్టుకు 2 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. రైల్వేలైను నిర్మాణంలో ప్రార్థనా లయాలు, చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలగకుండా ఇంజినీరింగ్ ప్రణాళికతో తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దానికి అనుగుణంగానే అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు.

70 కిలోమీటర్ల మెట్రోరైలు విస్తరణలో భాగంగా 5.5 కిలోమీటర్ల వరకు పాతబస్తీలో మెట్రోరైలు నిర్మాణానికి ప్రభుత్వం శుక్రవారం నాడు శంకుస్థాపన చేస్తోంది. నాగోల్-ఎల్బీనగర్-చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు- మైలార్ దేవ్ పల్లి-పీ7 రోడ్డు-శంషాబాద్ ఏయిర్ పోర్టు వరకు 29 కిలోమీటర్లు, మైలార్ దేవ్ పల్లి-ఆరాంఘర్- రాజేంద్రనగర్ వరకు 4 కిలోమీటర్లు, రాయదుర్గం- బయోడైవర్సిటీ జంక్షన్- నానక్ రాంగూడ విప్రో జంక్షన్, అమెరిక్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్లు, మియాపూర్ మెట్రో స్టేషన్- బీహెచ్ఈఎల్ పటాన్ చెరు వరకు 14 కిలోమీటర్లు, ఎల్బీనగర్ - వనస్థలిపురం-హయత్‌నగర్‌ వరకు 8 కిలోమీటర్లు మెట్రో రైలు కారిడార్‌కు అధికారులు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. రవాణా కష్టాలు తీర్చడంతోపాటు కాలుష్య నియంత్రణపై దృష్టి సారించిన ప్రభుత్వం... అన్నివైపులా మెట్రోను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత మిగితా కారిడార్‌లో మెట్రో మార్గాలపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.

Tags

Read MoreRead Less
Next Story