MEDARAM: మేడారంలో జోరుగా ముందస్తు మొక్కులు

MEDARAM: మేడారంలో జోరుగా ముందస్తు మొక్కులు
మేడారంలో ముందస్తుగా మొక్కుల చెల్లించుకుంటున్న భక్తులు.... భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్న వన దేవతల గద్దెలు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రసిద్దిగాంచింది. ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. వచ్చే నెలలో మహా జాతర జరగనుంది. ఇప్పట్నుంచే నుంచే మేడారంలో భక్తుల తాకిడి మొదలైంది. మేడారంలో ముందస్తు మొక్కుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. సమ్మక్క, సారలమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. వన దేవతల గద్దెలు భక్తజనంతో కిటికటలాడుతున్నాయి. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా జాతరకు సమయం దగ్గర పడుతుండడంతో.. అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయడంపై దృష్టి సారించారు. ఆర్టీసీ 6వేల బస్సులు నడుపనుంది. సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. రోజూ లక్షమందికిపైగా అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడంతో మేడారం రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.


సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే ముందు భక్తులు గట్టమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం....మేడారం బాట పడుతున్నారు. కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి దర్శించుకున్నారు. ఏటా అమ్మవార్లను దర్శించుకుంటామని తెలిపారు. మేడారం జాతరకు సంబంధించిన పనులకు ఈసారి గుత్తేదారులు తక్కువగా టెండర్లు వేశారు. పనులు నెమ్మదించాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతలో రాజీ పడకుండా సకాలంలో పనులు పూర్తి చేస్తామని ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు.


మరోవైపు వారం పది రోజుల్లో.. మేడారంలో పనులన్నీ పూర్తవుతాయని.. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్‌ తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహా జాతర.. ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో.. ఆయన పరిశీలించారు. వన దేవతలను దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. మేడారంలోని సమక్క భవనంలో అధికారులతో సమీక్షలో పాల్గొన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను శరత్‌ ఆదేశించారు. భక్తులు అధికంగా ఇప్పటి నుంచే వస్తున్నందున పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని.. అధికారులతో సమీక్ష అనంతరం శరత్‌ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story