Ganesh immersion 2021 : హైదరాబాద్‌లో ఘనంగా గణనాథుల శోభయాత్ర...!

Ganesh immersion 2021 : హైదరాబాద్‌లో ఘనంగా గణనాథుల శోభయాత్ర...!
నవరాత్రులు పూజలందుకున్న గణనాథుల మహా శోభాయాత్ర ప్రారంభమైంది. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వరకూ..17 కిలోమీటర్ల గణేషుల శోభాయాత్ర కొనసాగనుంది.

నవరాత్రులు పూజలందుకున్న గణనాథుల మహా శోభాయాత్ర ప్రారంభమైంది. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వరకూ..17 కిలోమీటర్ల గణేషుల శోభాయాత్ర కొనసాగనుంది. సోమవారం 5 గంటల్లోపు.. గౌరీసుతుడిని గంగమ్మ ఒడికి చేర్చి.. నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 17 కిలోమీటర్ల ఊరేగింపు మార్గంలో.. 276 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గణేశ్‌ శోభాయాత్రను గూగుల్‌ మ్యాప్స్‌కు అనుసంధానించారు. శోభాయత్ర, నిమజ్జన పర్వాన్ని వీక్షించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

హుస్సేన్‌సాగర్‌తోపాటు సరూర్‌నగర్, సఫిల్‌గూడ, కాప్రా, ప్రగతినగర్‌తోపాటు ఇతర చెరువులు...25 నిమజ్జన కోనేరుల్లో భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి గణేషుడి శోభాయాత్ర అనంతరం గంగమ్మ ఒడికి చేర్చేందుకు...ట్యాంక్‌బండ్‌పై 15 భారీ క్రేన్లను సిద్ధం చేశారు. రెండు క్రేన్‌కు సీఐని ఇన్‌ఛార్జ్‌గా నియమించగా...ఒక్కో క్రేన్‌ వద్ద ఎస్‌ఐ విధులు నిర్వహిస్తున్నారు. ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి చిల్డ్రన్ పార్క్ వరకు 12 క్రేన్‌లు, చిల్డ్రన్ పార్కు నుంచి వైస్రాయ్ హోటల్ వరకు మరో మూడు క్రేన్‌లను ఏర్పాటు చేశారు. సామూహిక నిమజ్జనాన్ని పోలీసులు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. గణేషుడి ఏరియల్‌ సర్వే కోసం హెలికాప్టర్‌ సైతం వినియోగిస్తున్నారు.

అటు చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, మదీనా, అఫ్జల్‌గంజ్‌, మొజంజాహీ మార్కెట్‌ నుంచి ఆబిడ్స్‌, బషీర్‌బాగ్‌ లిబర్టీ, హుస్సేన్‌ సాగర్‌ వరకూ విగ్రహాలతో వెళ్తున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇతర వాహనాలను అనుమతించటంలేదు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సమీపంలోని బషీర్‌బాగ్‌ ఫ్లై ఓవర్‌ కింద మాత్రమే... వాహనాలు, ప్రజలను అటూ, ఇటూ వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఆసుపత్రులకు వచ్చే అంబులెన్స్‌లు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మాత్రం ట్రాఫిక్‌ పోలీసులు మినహాయింపు ఇచ్చారు.

మరోవైపు గణేషుడి ఉత్సవాల కోసం తరలొచ్చే భక్తుల కోసం రైల్వే, మెట్రో, ఆర్టీసీ యంత్రాంగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకులతో పాటు ఇతర ప్రాంతాలకూ నడిచే మెట్రో సర్వీసుల సమయాన్ని అర్ధరాత్రి ఒంటి గంట వరకూ పెంచినట్లు హైదరాబాద్‌ మెట్రో ఎండీ వెల్లడించారు. ప్రారంభ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి ఒంటి గంటకు మొదలయ్యే మెట్రో సర్వీసు... చివరి స్టేషన్‌కు 2గంటలకు చేరుకోనుంది. 8 ఎంఎంటీఎస్‌ ప్రత్యేక సర్వీసుల్ని అదనంగా నడపనున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. 565 అదనపు బస్సుల్ని నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story