జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. జనరల్‌ మహిళకు కేటాయించిన మేయర్ పీఠం

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. జనరల్‌ మహిళకు కేటాయించిన మేయర్ పీఠం

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నగారా మోగింది. ఈ మినీ సంగ్రామానికి పార్టీలన్నీ సై అంటే సై అంటున్నాయి. దీంతో.. రాజకీయ వేడి రాజుకుంది. అటు.. ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీ తలమునకలైంది. బుధవారం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 20 వరకూ అంటే కేవలం 3 రోజులు మాత్రమే బల్దియా ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22 వరకూ ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదేరోజున ఇండిపెండెంట్లకు గుర్తులు కేటాయిస్తారు. ప్రచారానికి వారం రోజులే గడువిచ్చింది ఎన్నికల సంఘం. 29న ప్రచారం ముగిసాక, డిసెంబర్‌ 1న బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.. ఈసారి కరోనా కారణంగా పోలింగ్ సమయాన్ని గంట సేపు పొడిగించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. డిసెంబర్‌ 4న కౌంటింగ్‌ చేపట్టి, అదేరోజు విజేతల్ని ప్రకటిస్తారు. గతంలో చేసిన జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంది.. దానికి అనుగుణంగానే షెడ్యూల్‌ ప్రకటించినట్లు ఎస్‌ఈసీ పార్థసారథి వెల్లడించారు. రిటర్నింగ్ అధికారులతో చర్చించాక.. పోలింగ్ కేంద్రాల్ని ఖరారు చేస్తారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో వన్ ప్లస్ త్రీ పద్ధతిలో అధికారులు ఉంటారు. 150 డివిజన్లకు వేర్వేరుగా స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోసం 28 వేలా 500 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేశారు. ఎన్నికల విధుల కోసం 48 వేల మంది సిబ్బందిని నియమించనున్నారు.

ఈసారి మేయర్ పీఠాన్ని జనరల్‌ మహిళకు కేటాయించారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం వార్డులు 150 ఉండగా జనరల్-75, మహిళలకు 75 వార్డులు కేటాయించారు. జనరల్‌ మహిళకు 44 వార్డులు కేటాయించగా బీసీలకు రిజర్వ్ చేసిన 50 వార్డుల్లో 25 చోట్ల మహిళలు పోటీ చేస్తారు. ఎస్సీలకు 10వార్డులు, ఎస్టీలకు 2 వార్డులు కేటాయించారు. వీటిల్లోనూ సగం చోట్ల మహిళలే బరిలో దిగుతారు. ఇక డివిజన్ల డీలిమిటేషన్ లేదు. వార్డుల వారీగా రిజర్వేషన్‌ల ప్రక్రియ ప్రభుత్వానికి సంబంధించింది కావడంతో, 2016 రిజర్వేషన్ల ప్రాతిపదికన, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా GHMC ఎన్నికలు జరుగుతాయని SEC తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story