గ్రేటర్‌లో ఒంటరిగానే దూసుకెళ్తామంటోన్న బీజేపీ..

గ్రేటర్‌లో ఒంటరిగానే దూసుకెళ్తామంటోన్న బీజేపీ..
గ్రేటర్‌లో సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ.. ఒంటరిగానే దూసుకెళ్తామంటోంది. పవన్ కల్యాణ్ లాంటి చరిష్మా ఉన్న నాయకుడు అందుబాటులో ఉన్నప్పటికీ..

గ్రేటర్‌లో సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ.. ఒంటరిగానే దూసుకెళ్తామంటోంది. పవన్ కల్యాణ్ లాంటి చరిష్మా ఉన్న నాయకుడు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఎవరి సహాయం తీసుకోబోమని తేల్చి చెప్పింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించడంతో ఎక్కడో అక్కడ పొత్తు ఉంటుందని, సీట్ల సర్దుబాటు ఉంటుందని భావించారు. కనీసంలో కనీసం బీజేపీ తరపున ప్రచారం అయినా జరగొచ్చని అనుకున్నారు. ఎందుకంటే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత పవన్ కల్యాణ్‌ను కలిశారు. అప్పట్లో గ్రేటర్ ఎన్నికలపైనే వీరిద్దరూ చర్చించుకున్నారన్న టాక్ వినిపించింది. పైగా హైదరాబాద్‌లో సీమాంధ్ర ఓటర్ల ప్రభావం ఎక్కువ. తెలంగాణలో పవన్‌కు ఫ్యాన్ ఫాలోయింగూ ఎక్కువే. దీంతో పాటు కాపు సామాజికవర్గం ఓట్లు కూడా కలిసిరావొచ్చు. ఈ అవకాశాలన్నీ బీజేపీకి కలిసొచ్చే అంశాలే. అయినప్పటికీ జనసేనతో పొత్తు ఉండబోదని స్పష్టంగా చెప్పింది తెలంగాణ బీజేపీ.

గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేస్తామని జనసేన ప్రకటించింది. అయితే, ఎన్ని డివిజన్లలో పోటీచేస్తుందో చెప్పలేదు. అన్ని డివిజన్లలో పోటీ చేసేంత సత్తా ప్రస్తుతానికి ఆ పార్టీకి లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు నడుస్తోంది. కాని అక్కడి లెక్కలు అక్కడే అంటోంది తెలంగాణ బీజేపీ. దుబ్బాకలో ఎలక్షన్ క్యాంపైనింగ్‌కి పవన్ వస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కాని, బీజేపీ ఆ ఆలోచనే చేయలేదని తెలుస్తోంది. ఇప్పుడు కూడా ఒంటరి పోరాటానికే సై అంటోంది.

పొత్తు ఉండబోదని బీజేపీ ప్రకటించడంతో జనసేన తన బలాబలాలు ఏంటో తేల్చుకోవాలనుకుంటోంది. ముఖ్యంగా సీమాంధ్ర ఓటర్లు, కాపు సామాజిక వర్గ ఓట్లు, పవన్ ఫాలోయింగ్ తమకు కలిసివస్తుందని భావిస్తోంది జనసేన. పవన్ చెప్పిన దాని ప్రకారం.. జీహెచ్ఎంసీలోని పలు డివిజన్లలో జనసేన కమిటీలు చాలా బాగా పనిచేశాయట. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి బాసటగా నిలబడ్డారట. కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు చెప్పడం వల్లే జనసేనను గ్రేటర్‌ బరిలో దింపుతున్నామని ప్రకటించారు పవన్. ఎవరు నిలుస్తారు, ఎవరు ఓడతారో మరో 15 రోజుల్లో తేలిపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story