GHMC Elections : సెంచరీ కొట్టాలనుకున్న టిఆర్ఎస్ కు షాకేనా?

GHMC Elections : సెంచరీ కొట్టాలనుకున్న టిఆర్ఎస్ కు షాకేనా?

2016లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలిసిందే. ఒక్క డివిజన్ కూడా లేని అధికార పార్టీ టీఆర్ఎస్ ఏకంగా సెంచరీ వరకు వెళ్లింది. ఓట్లు, సీట్లు కొల్లగొడుతుందనుకున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు చతికిలపడిపోయాయి. కాని, అప్పటికీ ఇప్పటికీ సీన్ మారింది. పరిస్థితుల్లో తేడా వచ్చింది. దుబ్బాకకు ముందు వరకు టీఆర్ఎస్ సెంచరీ కొట్టేస్తుందన్నంత కాన్ఫిడెన్స్ ఉండేది. ఎప్పుడైతే బీజేపీ దూసుకొచ్చిందో.. కొన్ని సీట్లు తగ్గొచ్చనే అంచనాలు మొదలయ్యాయి. ఈ అంచనాలకు తగ్గట్టే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వచ్చాయి.

టీఆర్ఎస్‌కు సీట్లు తగ్గొచ్చు.. కాని మేయర్ పీఠం మాత్రం పక్కా. ఇదీ మొదటి నుంచీ ఉన్న అంచనాలు. ఎగ్జిట్ పోల్స్ కూడా సరిగ్గా ఇవే అంచనాలను వెల్లడించాయి. మేయర్ పీఠం ఎక్కేస్తాం, సెంచరీ కొడతాం అని బీజేపీ చెప్పుకున్నప్పటికీ ఆ స్థాయి సీట్లు రావని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే, ఓటింగ్ పర్సంటేజీపై కాస్తంత గందరగోళం ఏర్పడిందన్నది వాస్తవం. మధ్యాహ్నం మూడు గంటల వరకు 30 శాతం పోలింగ్ నమోదైతే.. పోలింగ్ ముగిసిన గంట తరువాత గతేడాది కంటే ఎక్కువ పోలింగ్ నమోదైనట్టు ఎస్ఈసీ తెలిపింది. చివరి గంటలో 9 శాతం పోలింగ్ పెరగడంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి.

2016లో టీఆర్ఎస్ 43.85 శాతం ఓట్ షేర్‌తో 99 సీట్లు గెలుకుంది. అయితే ఈసారి మాత్రం టీఆర్ఎస్ 38 శాతం ఓట్ల షేరుతో 68 నుంచి 78 సీట్లను మాత్రమే గెలుచుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది. ఇక ఆరా సర్వే అయితే టీఆర్ఎస్ 40 శాతం ఓటు షేరుతో 78 సీట్లు గెలుస్తుందని తెలిపింది. ఏడు సీట్లు ప్లస్ ఆర్ మైనస్ అవొచ్చని ఆరా సర్వే అంచనా వేసింది. ఇక సీపీఎస్ సర్వే ప్రకారం ఈసారి టీఆర్‌ఎస్‌ 39.8 శాతం ఓట్లతో 82 నుంచి 96 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది.

ఇక బీజేపీ విషయానికొస్తే.. 2016లో బీజేపీ 10.34 శాతం ఓట్లతో నాలుగు సీట్లు గెలిచింది. పీపుల్స్ పల్స్ తాజా సర్వే ప్రకారం.. బీజేపీ ఏకంగా 32 శాతం ఓటు షేరుతో 25 నుంచి 35 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. ఇక ఆరా సర్వే కూడా ఈసారి బీజేపీకి ఓట్లు, సీట్లు పెరుగుతాయని చెప్పింది. ఆరా సర్వే ప్రకారం ఈసారి బీజేపీ 31 శాతం ఓట్లతో 28 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. ఐదు సీట్లు ప్లస్ అవ్వొచ్చు మైనస్ అవ్వొచ్చని అంచనా వేసింది. ఇక సీపీఎస్ సర్వే మాత్రం బీజేపీకి కాస్త తక్కువ ఓట్లు, సీట్లు వస్తాయని చెప్పింది. ఈసారి బీజేపీ 27.9 శాతం ఓటు షేరుతో 12 నుంచి 20 సీట్లు దక్కించుకుంటుందని సీపీఎస్ సర్వే తెలిపింది.

కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే.. 2016లో కాంగ్రెస్‌ 10.40 శాతం ఓట్లతో రెండు సీట్లకే పరిమితం అయింది. లేటెస్ట్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగయ్యేలా కనిపించింది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 12 శాతానికి ఓటు షేరు పెంచుకుంటుందని, ఒకటి నుంచి 5 సీట్ల వరకు గెలుచుకోవచ్చని చెప్పింది. ఆరా సర్వే మాత్రం కాంగ్రెస్‌కు గతం కంటే రెండున్నర శాతం ఓట్లు తగ్గుతాయని, గెలిస్తే మూడు చోట్ల లేదంటే ఒక్క సీటూ గెలవకపోవచ్చని అంచనా వేసింది. ఇక సీపీఎస్ సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 14.7 శాతం ఓట్లు వస్తాయని, మూడు నుంచి ఐదు సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది.

ఎంఐఎం పార్టీ విషయానికొస్తే.. 2016లో ఎంఐఎం 15.85 శాతం ఓట్ షేరుతో 44 సీట్లు దక్కించుకుంది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం ఎంఐఎంకు ఈసారి 13 శాతం ఓట్లే వస్తాయని, 38 నుంచి 42 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. ఇక ఆరా సర్వే ప్రకారం ఎంఐఎం 13 శాతం ఓట్లు దక్కించుకుంటుందని, 41 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఐదు సీట్లు ప్లస్ లేదా మైనస్ కావొచ్చని ఆరా సర్వే అంచనా వేసింది. సీపీఎస్ సర్వే ప్రకారం 13.4 శాతం ఓటు షేర్ వస్తుందని, 32 నుంచి 38 సీట్లు గెలుస్తుందని చెప్పింది. ఓవరాల్‌గా 2016తో పోల్చితే ఎంఐఎంకు ఓట్లు, సీట్లు తగ్గుతాయని ఇప్పటి ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story