గ్రేటర్‌ ఎన్నికల్లో మధ్యాహ్నం వరకు నమోదైన పోలింగ్‌ శాతం ఎంతంటే?

గ్రేటర్‌ ఎన్నికల్లో మధ్యాహ్నం వరకు నమోదైన పోలింగ్‌ శాతం ఎంతంటే?

ఓటు మన బాధ్యత.. ఓటు మన భవిష్యత్తు.. సమర్థుడైన నాయకుణ్ని ఎన్నుకునేందుకు మనుకున్న ఒకే ఒక దారి ఓటు.. కానీ, అంతటి విలువైన ఓటును హాలిడే మత్తులో వదిలేసి మన భవిష్యత్తును, భావితరాల భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నాం.. చదవలేని, చదువుకోని వారు సైతం బాధ్యతగా భావించి క్యూలైన్‌లో నిలబడి ఓటు వేసి వస్తుంటే.. ఉన్నత చదువులు చదివిన వారు మాత్రం తన ఓటును ఒక్కరోజు సెలవు కోసం తెగనమ్ముకుంటున్నారు.. ఈసారి కూడా గ్రేటర్‌లో సేమ్‌ సిచ్యుయేషన్‌.. పార్టీలు మొత్తుకున్నా, అభ్యర్థులు వేడుకున్నా.. ఎస్‌ఈసీ ప్రచారం చేసినా.. జీహెచ్‌ఎంసీ అవగాహన కల్పించినా ఓటర్లలో మాత్రం మార్పు రాలేదు.. గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటు వేయడానికి అడుగులు ముందుకు పడలేదు.

గ్రేటర్‌ ఎన్నికల్లో తొలి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్‌ 18.2 శాతం.. శివారు డివిజన్లలో తప్ప మిగతా పోలింగ్‌ కేంద్రాల్లో ఎక్కడా క్యూలైన్లు కనిపించడం లేదు.. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ప్రైవేటు ఉద్యోగులంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు.. దీంతో ఈసారి కూడా పోలింగ్‌ 45 శాతం దాటే పరిస్థితి కనిపించడం లేదు. గత ఎన్నికల పోలింగ్‌ పర్సెంటేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఓటర్లను రప్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘంతోపాటు జీహెచ్‌ఎంసీ చాలానే కష్టపడింది.. ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు చేయని ప్రయత్నం లేదు. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాతోపాటు సోషల్‌ మీడియాలోనూ ప్రకటనలతో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. పార్టీలు కూడా సొంతూళ్లకు వెళ్లిన వారిని హైదరాబాద్ రప్పించి వారితో ఓటు వేయించేందుకు చాలానే కష్టపడ్డాయి.. అయినా ఓటర్లలో స్పందన లేదు.. సెలవు ఇచ్చింది ఎంజాయ్‌ చేయడానికి కాదు.. ఓటు వేయడానికి.. ఓటు వేయనప్పుడు సమస్యలపై ప్రశ్నించే హక్కు ఎక్కడుంటుంది..?

2016 లెక్కల ప్రకారం గ్రేటర్‌లో 74 లక్షలా 24వేలా 96 మంది ఓటర్లుండగా.. గత ఎన్నికల్లో పోలైన ఓట్లు 33 లక్షలా 62వేలా 688 మాత్రమే.. అంటే 45.29 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.. గతంలో జరిగిన ఎన్నికల సమయంలోనూ ఇదే పరిస్థితి. 2014లో జీహెచ్‌ఎంసీ పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 53 శాతమే ఓటింగ్‌ నమోదైంది.. 2018లో గ్రేటర్‌ పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 50.86 శాతమే ఓటింగ్‌ నమోదైంది. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ హైదరాబాద్‌ సెగ్మెంట్‌లో 44.75 శాతమే ఓట్లు పోలయ్యాయి.. సికింద్రాబాద్‌ పార్లమెంటుకూ 46.26 శాతమే పోలింగ్‌ జరిగింది.. ఈ ఏడాది 74 లక్షలా 67 వేలా 256 మంది ఓటర్లు లెక్కతేలినా వీరిలో సగం మంది కూడా ఓటేస్తారో లేదో చెప్పలేని పరిస్థితి.. ఈసారి కూడా జనం పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకపోవంతో అభ్యర్థులు ఆందోళన నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story