గ్రేటర్‌ పోరుకు కౌంట్‌డౌన్‌ షురూ

గ్రేటర్‌ పోరుకు కౌంట్‌డౌన్‌ షురూ

గ్రేటర్‌ సమరానికి సమయం ఆసన్నమైంది. మరి కొన్ని గంటల్లో బల్దియా ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తోపాటు జీహెచ్‌ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. పూర్తి శిక్షణతో ఎన్నికల సామాగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు సిబ్బంది. ఈ ఎన్నికల కోసం 18 వేల 202 బ్యాలెట్‌ బాక్సులు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ కోసం 36 వేలకుపైగా సిబ్బందిని వినియోగించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు 60 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, 30 స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌లు, 150 మంది రిటర్నింగ్‌ అధికారులు, మరో 150 మంది సహాయ రిటర్నింగ్‌ అధికారులు, 12 మంది సాధారణ పరిశీలకులు, 1700 మంది మైక్రో అబ్జర్వులు పనిచేయనున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 74 లక్షలా 4వేలా 256 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 38 లక్షలమందికిపైగా పురుషులు కాగా.. 35 లక్షల మందికిపైగా మహిళా ఓటర్లున్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో అత్యధికంగా 79 వేల 290 మంది ఓటర్లుండగా.. రామచంద్రాపురం డివిజన్‌లో 27 వేల 998 మంది ఓటర్లున్నారు. బ్యాలెట్‌ ద్వారా జరిగే ఎన్నికలకు 9 వేల 101 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొండాపూర్‌లో అత్యధికంగా 99 సెంటర్లుండగా.. రామచంద్రాపురం డివిజన్‌లో అత్యల్పంగా 33 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 2 వేల 920 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన చోట్ల సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా డివిజన్‌కు ఒకటి చొప్పున 150 చోట్ల ఫేస్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ ద్వారా ఓటరు గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు.

మొత్తం 150 డివిజన్లకు జరుగుతున్న ఎన్నికల్లో... 1122 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి 150, బీజేపీ నుంచి 149, టీడీపీ నుంచి 106, ఎంఐఎం నుంచి 51, సీపీఐ నుంచి 17 మంది బరిలో నిలిచారు. ఇతర రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులు 76 మంది, ఇండిపెండెంట్లు 415 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక అత్యధికంగా జంగమెంట్‌ డివిజన్‌లో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఐదు డివిజన్లలో కేవలం ముగ్గురు మాత్రమే పోటీచేస్తున్నారు. మరోవైపు లా అండ్‌ ఆర్డర్‌ ప్రాబ్లమ్‌ రాకుండా భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. మొత్తం 52 వేల 500 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ఓటర్లను తరలిస్తే వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో ఈసారి బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య వెయ్యికి మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కును విధిగా ధరించాల్సి ఉంటుంది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. భౌతికదూరాన్ని పాటించేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించారు. అటు ఎన్నికలు అభ్యర్థుల్లో ఆందోళన మరింతగా పెంచుతున్నాయి. ప్రజల మద్దతు కోసం వారం రోజులుగా ప్రచారంలో మునిగి తేలిన పార్టీలు.. తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని టెన్షన్‌ పడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story