ఇంత ఘోరమా..? సాయత్రమైనా 25 శాతం దాటని పోలింగ్..!

ఇంత ఘోరమా..? సాయత్రమైనా 25 శాతం దాటని పోలింగ్..!

ఇంత ఘోరమా..? రాష్ట్ర రాజధాని! మెట్రో పాలిటన్ సిటీ.! 400 ఏళ్ల చరిత్ర కలిగిన నగరం..! అత్యధిక అక్షరాస్యత...! విశ్వనగరం..,! అన్ని..అన్నీ.. ఒట్టిమాటలే. పొద్దునలేస్తే అందరూ నీతులు చెప్పేవాళ్లే. సోషల్‌ మీడియాలో నీతులు చెబుతూ పోస్టులు పెట్టేవారే. చెప్పేందుకేనా నీతులు ఉన్నది.. పాటించడం చేతకాదా? నీ తలరాతను మార్చే ఓటు.. నీ భవిష్యత్‌ను డిసైడ్ చేసే ఓటు..సమర్థుడైన నాయకుణ్ని ఎన్నుకునేందుకు మనుకున్న ఒకే ఒక దారి ఓటు.. కానీ, అంతటి విలువైన ఓటును హాలిడే మత్తులో వదిలేసి మన భవిష్యత్తును, భావితరాల భవిష్యత్తును చేజేతులా నాశనం చేస్తారా? మరీ ఇంత బద్దకమా? సెలవు ఇచ్చింది నిండా ముసుగేసుకొని పడుకొమ్మని కాదు..! ప్రభుత్వ కార్యాలయాలు.. ఇతర ఆఫీసులు, ప్రైవేట్ సంస్థలు పనిచేస్తే.. ఓటు వేసేందుకు సమయం ఉండదని.. సెలవు ప్రకటించారు.. ఆ సంగతి కూడా మరిచి...హాలిడే మత్తులో జోగుతూ.. ఓటు వేయాలన్న కనీస బాధ్యతను విస్మరిస్తారా? ఓటు వేయడమే చేతకాని వారికి రేపు సమస్యలపై ప్రశ్నించే హక్కు ఉంటుందా? నాయకుడిని నిలదీసే నైతికత వస్తుందా? ఓటు మాత్రం వేయరు కానీ...మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించాలి.. వీలైతే ప్రతీది మీ ఇంటిగుమ్మంలోకి వచ్చి వాలాలి. ఇదేనా పద్ధతి? ఇదేనా చదువుకున్న వాళ్లు చేయాల్సిన పని.

దారుణం ఏంటంటే చదువుకున్న వాళ్లు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే అతి తక్కువ పోలింగ్ నమోదైంది....అంతా చదువుకున్న వాళ్లే.. ఓటు విలువ తెలిసిన వాళ్లే.. మరి ఏమైంది.. మీ చైతన్యం.. ? ఓటు వేయమంటూ ఇచ్చిన సెలవుని కూడా వీకెండ్ మాదిరిగానే ఎంజాయ్ చేస్తారా? ఇది సిగ్గుపడాల్సిన అంశం కాదా? దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని అంటారు.. మరి ఇలాగేనా దేశ భవిష్యత్‌ను నిర్దేశించేది?

సిటీకన్నా శివారు ప్రాంతాలు ఎంతో నయం. అక్కడ చైతన్యం వెల్లివిరుస్తోంది. భారతినగర్, పటాన్‌చెరు, ఆర్సీపురంలో మధ్యాహ్నానికే 40 శాతం పోలింగ్ దాటిపోయింది. పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం వరకు శివారు ప్రాంతాల్లో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొన్ని చోట్ల వృద్ధులు వీల్ చైర్లలో వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. మరికొన్ని చోట్ల వికలాంగులు చేతికర్ర సాయంతో వచ్చి ఓటేశారు. అలాంటి వారిని చూస్తే కూడా బుద్ధిరాదా? అణువణువు బద్దకంతో నిండిపోయిన శరీరంలో చలనం కలగదా? ఓటు వేయాలన్న తపన కనిపించదా? చదవలేని, చదువుకోని వారు సైతం బాధ్యతగా భావించి క్యూలైన్‌లో నిలబడి ఓటు వేసి వస్తుంటే.. ఉన్నత చదువులు చదివిన వారు మాత్రం తన ఓటును ఒక్కరోజు సెలవు కోసం తెగనమ్ముకుంటున్నారు.

నచ్చిన సినిమా హీరో కోసం.. పొద్దునే వెళ్లి...సినిమా థియేటర్ల గేట్లు కూడా తీయకముందే వెళ్లి క్యూలు కడుతారు. మరి నీ భవిష్యత్‌ను నిర్దారించే ఓటింగ్ అంటే మాత్రం ఎందుకంత నిర్లక్ష్యం? తెల్లారి లేచింది మొదలు.. సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు అన్ని చెప్పడమేనా? నీతి వ్యాక్యాలు వల్లించడమేనా? ఓటు హక్కు వినియోగించుకోని మీకేందుకు ఓటు? అసలు పోలింగ్ కేంద్రాలవైపు కన్నెత్తి చూడని వారికి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలను రద్దు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది... ప్రస్తుత ఓటింగ్ సరళే కొనసాగితే ఓవరాల్‌గా పోలింగ్ 40 శాతం కూడా దాటే పరిస్థితులు కనిపించడం లేదు.


Tags

Read MoreRead Less
Next Story