TG: మానేరు వాగుపై కుప్పకూలిన వంతెన

TG: మానేరు వాగుపై కుప్పకూలిన వంతెన
తప్పిన పెను ప్రమాదం... విచారణకు ప్రభుత్వం ఆదేశం

పెద్దపల్లి జిల్లా మానేరు వాగుపై నిర్మాణంలోని వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. 2016లో ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణం.. తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతూ వస్తోంది. ఇప్పుడు వంతెన పూర్తై తమకు అందుబాటులోకి వస్తుందనుకు‌న్న ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. నిర్మాణంలో ఉండగా ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాల పల్లి జిల్లాలను కలుపుతూ ఈ వాగుపై వంతెన నిర్మాణం జరుగుతోంది. 2016లో దాదాపు 46 కోట్లతో ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. మధ్యలో కాంట్రాక్టర్లు మారడం, నిధుల లేమి తదితర కారణాలతో నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. వంతెన పక్కన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. పిల్లర్లు, గట్టర్లకు మధ్య బ్యాలెన్సింగ్ కోసం పెట్టిన చెక్కముక్కలు చెదలు పట్టాయి. దీంతో గట్లర్లు ఒకవైపు వంగినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా నిర్మాణం చేపట్టకపోవడంతో ఈదురు గాలులకు బ్యాలెన్స్ తప్పి కూలినట్లు భావిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. నాసిరకం పనుల కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ఆరోపిస్తున్నారు.

మానేరువాగుపై వంతెన కూలిన ఘటనపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. కమీషన్ల కోసం గత ప్రభుత్వం....నాసిరకంగా పనులు చేపట్టడం వల్లే కాళేశ్వరం, తాజాగా మానేరు వాగు వంతెన కూలిపోయాయని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. వంతెన కూలిన ఘటనపై విచారణ జరిపించి..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. 2016లో ప్రారంభించిన ఈ వంతెన పూర్తైతే... పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల మధ్య దూరం సుగమం కానుంది.

Tags

Read MoreRead Less
Next Story