Telangana :మంత్రివర్గంలో ఎవరికేది ?

Telangana :మంత్రివర్గంలో ఎవరికేది ?
కొత్త ప్రభుత్వ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి

రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరికీ మంత్రులుగా అవకాశం కల్పిస్తారనే అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చ సాగుతోంది. పలువురు సీనియర్లతోపాటు కొత్తవారికి అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పు చేసే అవకాశం ఉందని.... సంబంధిత వర్గాలు తెలిపాయి.

కొత్త ప్రభుత్వంలో మంత్రులెవరన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌... త్వరలోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనుంది. సీఎం ఎంపికపై అధిష్ఠానం నుంచి ఇంకా నిర్ణయం రాకపోవడంతో 6 లేదా 9న ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. పూర్తిస్థాయి మంత్రివర్గం... ఒకేసారి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రితో కలిపి 18 మందితో...... మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొనే అవకాశంఉంది. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కాకుండా మరో 16 మందికి అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ప్రత్యేకించి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఖమ్మం జిల్లాలనుంచి ఎక్కువమంది MLAలు గెలుపొందారు. గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవంతోపాటు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారుగతంలో ఎంపీలుగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వారిని మంత్రి పదవులకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. తొలిసారి శాసనసభలోకి అడుగుపెట్టిన వారికి అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆదిలాబాద్‌ నుంచి వివేక్, ప్రేమసాగర్‌రావు, నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి శ్రీధర్‌బాబు, పొన్నంప్రభాకర్‌ పేర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశముంది జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డి ఓడిపోయినా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సీనియార్టీని పరిగణనలోకి తీసుకొని ఆయనకు అవకాశం ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. మైనార్టీ వర్గం నుంచి పోటీ చేసిన వారంతా ఓడిపోయారు. ఈతరుణంలో షబ్బీర్‌అలీని మంత్రివర్గంలోకి తీసుకొని మండలికి పంపుతారనే ప్రచారం సాగుతోంది. మెదక్‌ జిల్లా నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా పేరు ఖరారైనట్లుగా వినిపిస్తోంది. ఆజిల్లానుంచి మరొకరికి అవకాశం తక్కువే. మహబూబ్‌నగర్‌ నుంచి రేవంత్‌రెడ్డి మినహాయిస్తే జూపల్లి కృష్ణారావు, వంశీకృష్ణపేర్లతోపాటు షాద్‌నగర్‌ నుంచి గెలుపొందిన శంకర్‌ను పరిశీలించవచ్చని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో గడ్డం ప్రసాద్, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి నుంచి ఎంపిక చేసే వీలుంది. నల్గొండ జిల్లాలో సీనియర్‌ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. ఉత్తమ్‌ ఆసక్తి చూపకపోతే ఆయన భార్య పద్మావతికి అవకాశం ఇవ్వవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరంగల్‌ నుంచి సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్కతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. స్పీకర్‌ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో ఉన్న పోటీని పరిగణనలోకి తీసుకొని తుమ్మల పేరును స్పీకర్‌ స్థానానికి పరిశీలించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story