రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై పలు సూచనలు

రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై పలు సూచనలు
కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ సూచన

ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌ తమిళిసై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఆర్టీసీ భూములు, ఆస్తుల పరిరక్షణ కార్పొరేషన్‌కే అప్పగించాలని సిఫార్సు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని గవర్నర్‌ సూచించారు. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆస్తులను విభజించి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రక్రియను పూర్తి చేయాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. బకాయిలను క్లియర్ చేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలలని సూచించారు. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు, బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణ పింఛన్లు, పే స్కేలు, ప్రావిడెంట్ ఫండ్స్, ఇతర గ్రాట్యుటీలు, సర్వీస్ నియమాలన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై సిఫారసు చేశారు.

ఆర్టీసీ ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడి శారీరక శ్రమ కారణంగా సేవకు అనర్హులైతే.. కారుణ్య నియామకాల కింద వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ సూచించారు. ఆర్టీసీలో క్రమశిక్షణా చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అందువల్ల, క్రమశిక్షణా చర్యలు మానవీయంగా ఉండాలని... ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సర్వీస్ రూల్స్ ఉండాలన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ఇతర శాఖలకు డిప్యుటేషన్‌పై పంపినట్లయితే, వారి గ్రేడ్ పే, జీతం, ప్రమోషన్లు అందుకు తగ్గట్టుగా ఉండాలని సూచించారు.

ఆర్టీసీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించాలని గవర్నర్‌ తమిళిసై ప్రభుత్వానికి సిఫారసు చేశారు. రాష్ట్ర సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు సమానమైన ప్రయోజనాలు ఆర్టీసీ ఉద్యోగులకు కల్పించాలని సూచించారు. ఆర్టీసీ ఆసుపత్రుల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందడం, నిర్దిష్ట స్థాయి వరకు ప్రభుత్వ హెల్త్ స్కీమ్ బీమా ప్రయోజనాలు ఉండాలని గవర్నర్‌ సిఫారసు చేశారు. బస్సుల నిర్వహణ వంటి పనులను ప్రభుత్వమే చేపట్టాలని సూచించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ద్వారా కార్మికులందరికీ ప్రయోజనం చేకూరుతుందని గవర్నర్‌ తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story