Telangana : గ్రామ పంచాయతీ అనుమతులన్నీ ఇకపై ఆన్‌లైన్‌

Telangana : గ్రామ పంచాయతీ అనుమతులన్నీ  ఇకపై  ఆన్‌లైన్‌
ప్రతి కొనుగోలుకు బిల్లులు, ఓచర్లు తప్పనిసరి

గ్రామ పంచాయతీల్లో అన్ని అనుమతులు, లైసెన్సులు ఆన్ లైన్ విధానంలోనే జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకాధికారులను ఆదేశించింది. అవసరమైన విద్యుత్ పరికరాలు, బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ తదితర సామగ్రిని టెండర్ల ద్వారానే కొనుగోలు చేయాలన్న ప్రభుత్వం ప్రతి కొనుగోలుకు బిల్లులు, ఓచర్లు ఉండాలని నిర్దేశించింది. ఇంటి పన్నుల వసూళ్లను ముమ్మరంగా చేపట్టి అక్టోబరు నెలాఖరుకు వంద శాతం లక్ష్యం చేరాలని సూచించింది. పంచాయతీలకు పన్నులు, అనుమతుల రూపేణా వచ్చిన ఆదాయాలను ఏ రోజుకారోజు ట్రెజరీల్లో జమ చేయాలని పేర్కొంది. గ్రామల్లో తప్పనిసరిగా రెండు నెలలకోసారి విధిగా గ్రామసభలు నిర్వహించాలని పేర్కొంది. ఏవైనా అత్యవసర కొనుగోళ్లు చేయాలంటే ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శి జాయింట్ చెక్కుతో ట్రెజరీ నుంచి నిధులు పొందాలని తెలిపింది.

గ్రామపంచాయతీలో ప్రతి రెండు నెలలకొకసారి గ్రామ సభ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గ్రామ రికార్డులన్నీ పంచాయతీ కార్యాలయంలోనే ఉంచాలని, వాటికి గ్రామ కార్యదర్శి బాధ్యత వహించాలని తెలిపింది. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో స్పెషల్‌ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం స్పెషల్‌ ఆఫీసర్ల విధులకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామ పారిశుధ్యం పనులను పర్యవేక్షించాలని, తాగునీటి సరఫరాలో నాణ్యత పాటించే విధంగా, ఇంటింటికి తాగునీటిని అందించే విధంగా చేయాలని సూచించింది. విద్యుత్‌ చార్జీలను ప్రతి నెలా చెల్లించాలని, గ్రామ పంచాయతీ స్థాయిలో ఇచ్చే అనుమతులన్నింటిని ఆన్‌లైన్‌లో ఇవ్వాలని ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story