హైదరాబాద్‌ లో కుంభవృష్టి.. ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం

హైదరాబాద్‌ లో కుంభవృష్టి.. ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం
హైదరాబాద్‌ను కుంభవృష్టి అతలాకుతలం చేసింది.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో రోడ్లు చెరువులను తలపించాయి.. లోతట్టు ప్రాంతాలు..

హైదరాబాద్‌ను కుంభవృష్టి అతలాకుతలం చేసింది.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో రోడ్లు చెరువులను తలపించాయి.. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయి.. దట్టమైన మేఘాలు ఆవరించి, ఆ వెంటనే ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది.. నాన్‌స్టాప్‌గా కురిసన వాన నగరాన్ని చిగురుటాకులా వణికించింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కార్లు, ఆటోలు నీళ్లలో ఉండిపోయాయి. ద్విచక్రవాహనాలైతే నీటి ఉధృతిలో కొట్టుకుపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముంపు ప్రాంతాల ప్రజలు బయటికి రావొద్దని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది. అటు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ టీంల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, తార్నాక, నాంపల్లి, మెహదీపట్నం, అత్తాపూర్‌, అబిడ్స్‌, బేగంపేట్‌, ఖైరతాబాద్‌, పాతబస్తీ, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్‌, లంగర్‌హౌస్‌, షేక్‌పేట్‌ సహా పలు ప్రాంతాల్లో వాన విరుచుకుపడింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన జంక్షన్లన్నీ భారీగా వాహనాలతో నిండిపోయాయి.

ఫలక్‌నుమా, షేక్‌పేటలో అత్యధికంగా 10.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. అత్తాపూర్‌లో 10.5 సెంటీమీటర్లు, ఫిల్మ్‌నగర్‌, రాజేంద్రనగర్‌లో 9.7 సెంటీమీటర్లు, తొర్రూర్‌, దూద్‌బౌలిలో 8.8, ఉప్పల్‌లో 8.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.. టోలీచౌకిలో 8 సెంటీమీటర్లు, మెహిదీపట్నంలో 7.5, జియాగూడలో 7, గుడిమల్కాపూర్‌లో 6.7, శ్రీనగర్‌ కాలనీలో6.6, లలితాబాగ్, ఉప్పల్, జూబ్లీహిల్స్, మలక్‌పేటలో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చార్మినార్, బంజారాహిల్స్‌లో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది.

ఫిర్జాదీగూడ కార్పొరేషన్‌ 19వ డివిజన్‌లో వర్షం ధాటికి ఓ గోడ కూలి తండ్రి కొడుకులు మృతి చెందారు. చెరువుకట్ట సమీపంలో ఉన్న హనుమాన్‌ దేవాలయం ప్రహారీ గోడ కూలింది. అదే సమయానికి అటువైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న 40 ఏళ్ల ప్రవీణ్‌, అతడి 10 ఏళ్ల కుమారుడిపై పడింది. గోడ రాళ్లు ఇద్దరిపై పడి దెబ్బతగలడంతో అక్కడిక్కడే తండ్రీ కొడుకులు మృతి చెందారు. మరోవైపు వర్షాలతో కుషాయిగూడ ఏఎస్‌రావునగర్‌లో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు ప్రజలు చూస్తుండగానే రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడింది. రోడ్డు కుంగడంతో వాహనదారులు ప్రమాదానికి లోనవకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ రోడ్డుపై ట్రాఫిక్‌ను దారిమళ్లించారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం నేపథ్యంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నగరంలో పరిస్థితిని అనుక్షణం తెలుసుకుంటున్నారు.. అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.. సీజీఎం, సూపరింటెండింగ్‌ ఇంజినీర్లతో విద్యుత్ సరఫరాపై పరిస్థితిని సమీక్షించారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ రఘుమారెడ్డి. డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, సెంట్రల్ బ్రేక్ డౌన్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియజేయాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story