తెలంగాణలో కుంభవృష్టి

తెలంగాణలో కుంభవృష్టి
తెలంగాణను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆయా జిల్లాల్లో ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వాన కురుస్తోంది. వచ్చే రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్నందు..

తెలంగాణను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆయా జిల్లాల్లో ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వాన కురుస్తోంది. వచ్చే రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్నందున ప్రజ‌లంద‌రూ అప్రమ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. ఈ క్రమంలో వాతావ‌ర‌ణ శాఖ అప్రమత్తమైంది. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేయగా.. తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. కరెంట్‌ తీగలు తెగిపడ్డాయి. పంటపొలాలు నీట మునిగాయి. వరి, చెరకు, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బూర్గంపాడు మండలంలో ఎడ తెరిపిలేని వర్షాలతో.. లోతట్టు ప్రాంతాలు విలవిలలాడుతున్నాయి.

అటు.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జర్ల నియోజకవర్గంలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అల్వాన్‌పల్లి సమీపంలో దుందుభినది పొంగి పొర్లుతోంది. జడ్చర్ల పట్టణం కావేరమ్మ పేట సమీపంలో ఉన్న నల్ల చెరువు రెండు దశాబ్ధాల తర్వాత నిండింది. అలుగు పారడంతో వెంకట్‌రెడ్డి కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. అటు.. నాగర్‌కర్నూల్‌లోనూ వరద బీభత్సం సృష్టిస్తోంది.

మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలో భారీ వర్షానికి పంటలు నీట మునిగాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి నీరు వచ్చింది. రామాయంపేటలోని తహసీల్దార్‌ కార్యాలయం, అగ్నిమాపక శాఖ కార్యాలయం, అటవీశాఖ కార్యాలయాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని సుమారుగా 15 కరెంటు పోల్స్ రోడ్డుపై పడ్డాయి. దీంతో పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరెంటు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక.. అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం కోహెడ వద్ద వాగులో నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story