తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. హైదరాబాద్ లో భారీ వర్షం

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. హైదరాబాద్ లో భారీ వర్షం
తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రెండ్రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది..

తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రెండ్రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కురుస్తున్నకుంభవృష్టితో వాగులు పొంగిపొర్లుతున్నాయి. నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించగా, మరోవైపు బంగాళాఖాతంలో ఏపీ తీరానికి దగ్గరలో ఏర్పడిన అల్ప పీడనం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అత్యధికంగా 16.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పట్టణంలోని శ్రీనివాస కాలనీ, మానసనగర్, ఇందిరమ్మకాలనీ శివారు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షం నీరు చేరింది. మానసనగర్‌ కింది ఆవాస ప్రాంతం జలమయమైంది. ప్రజలు నిత్యావసరాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నశింపేట వద్ద వాగు దాటుతుండగా గొర్రెలను తరలిస్తున్నవాహనం అదుపు తప్పింది. వాహనంలోని ముగ్గురిని స్థానికులు కాపాడారు.

నల్గొండ జిల్లా తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున పత్తి పంట నీట మునిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పొలాలు నీటితో నిండిపోయాయి. వలిగొండలోని ఒకటో వార్డులోని పలు ఇళ్లల్లోకి నీరు చేరింది. సిద్దిపేట జిల్లా మార్కుక్‌ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ బీరప్పగుడి వద్ద గండి పడింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో వీరాపూర్‌ సరిహద్దులోని శివశంకర్‌ ప్రాజెక్టుకు గండి పడటంతో వందలాది ఎకరాల పంట నీట మునిగింది. ప్రాజెక్టు కింద ఆయకట్టు 890 ఎకరాలు ఉండగా గండి పడటంతో 250 ఎకరాల వరి కొట్టుకుపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని నష్టపోయిన రైతులు కోరుతున్నారు.

భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సూరారంలో ఇళ్లు నీట మునిగాయి. శాలిగౌరారం ప్రాజెక్టుకు వెళ్లే కాలువ గ్రామం సమీపం నుంచి వెళ్లడంతో.. వరదనీరు 50 ఇళ్లలోకి చేరింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హుటా హుటిన గ్రామానికి చేరుకొని, అధికారులతో సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లలోని వారిని సురక్షితంగా బయటకు తరలించారు. తక్షణ సహాయంగా బాధితులకు లక్షరూపాయలు అందజేశారు. బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్‌, చండ్రుగొండ, జూలూరుపాడు మండలాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. సీతాయిగూడెం, అయ్యన్నపాలెం మధ్యలో వాగు ఉధృత ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జూలూరుపాడు మండలం నల్లబండబోు గ్రామంలోని సీతారామ ప్రాజక్టు కాలువలోకి భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టు కాలువకట్ట పైనుంచి గ్రామంలోని పలు ఇళ్లల్లోకి నీరు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story