Hyderabad: హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం

Hyderabad: హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం
భారీ వర్షంతో నీట మునిగిన పలు కాలనీలు గాజుల రామారంలో వరద ఉదృతి జలమయంగా మారిన రోడ్లు ఇళ్లలోకి చేరిన వరద నీరు

ఆకాశానికి చిల్లు పడిందా.. అన్నట్టుగా మూడ్రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో మహానగరం జలమయంగా మారింది. జన జీవనం స్తంభించింది. వర్షాలకు నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్‌జాం అవుతోంది. చిరుజల్లులతో మొదలైన వాన..అర్ధరాత్రి వరకు దంచి కొడుతూనే ఉంది. దీంతోనగరంలో భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. భారీ వర్షంతో పలు కాలనీలు నీట మునిగాయి.గాజుల రామారంలో వరద ఉదృతి పెరిగింది.రోడ్లు జలమయం అయ్యాయి.పలు కాలనీలతో ఇండ్లలోకి నీరు చేరింది.

మరోవైపు గాజులరామారం పరిసర ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇక సచివాలయం బస్టాప్‌లో భారీగా వరద నీరు చేరింది. దీంతో మోటార్ల సహాయంతో వరద నీటిని తోడేశారు అధికారులు. ఇక నగరంలోని పలు చోట్ల శిథిలావస్థకు చేరిన ఇళ్లు వర్షాల కారణంగా కూలిపోతున్నాయి. ఇలాంటి వాటిపై జీహెచ్‌ఎంసీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇక గ్రేటర్ లో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో జిహెచ్ఎంసి అప్రమత్తమైంది. గ్రేటర్ పరిధిలో 426 జిహెచ్ఎంసి మాన్ సూన్ టీమ్స్ ను రెడీ చేసింది. దీంతో పాటు 170 కు పైగా స్టాటిక్ టిమ్‌ను ఏర్పాటు చేసి ఎక్కడ వాటర్ నిలిచిన క్లియర్ చేయడం, చెట్లు విరిగిపడిపోయినా సహాయక చర్యలు అందించేలా ఈ టీమ్స్ ను పనిచేయనున్నాయి. మరోవైపు బల్దియా లోని 185 చెరువుల పరిస్థితిని జిహెచ్ఎంసి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిహెచ్ఎంసికి అందిన ఫిర్యాదులతో చర్యలు చేపడుతున్నారు.

ఇక ఎడతెరిపిలేని వానలతో శిథిలావస్థకు చేరిన ఇళ్లు నాని కూలిపోతున్న ఘటనలు కూడా నగరంలో చోటుచేసుకున్నాయి.గ్రేటర్‌లోని రెండు ప్రాంతాల్లో పాత ఇల్లు కూలిపోయాయి. అయితే ప్రమాద సమయంలో ఎవరు ఇండ్లలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కవాడిగూడలోని ఓ శిథిలావస్థకు చేరిన ఇల్లు తో పాటు బేగం బజార్లో ఓ ఇంటి పై కప్పు కూలింది. మరో రెండు రోజులపాటు ఇవే ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అవసరమైతే తప్ప నగర వాసులు బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story