తెలంగాణలో జోరు వానలు.. హైదరాబాద్‌లో..

తెలంగాణలో జోరు వానలు.. హైదరాబాద్‌లో..
తెలంగాణలో వర్షాల జోరు ఆగడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. నగరమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది..

తెలంగాణలో వర్షాల జోరు ఆగడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. నగరమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. ప్రధాన రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టు కాలనీల్లో నడుములోతు నీరు చేరుకుంటోంది. ఎడతెరిపి లేని వర్షాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సరూర్‌నగర్‌లోని తపోవన్‌ కాలనీలో ఓ వ్యక్తి వరదనీటిలో గల్లంతయ్యాడు. చెరువు గట్టున వరద ప్రవాహాన్ని స్కూటీతో దాటుతుండగా.. అదుపుతప్పి పడిపోయాడు. ప్రవాహంతో పాటే చెరువులోకి కొట్టుకుపోయాడు నవీన్‌ కుమార్‌. గల్లంతైన అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షించారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.

భారీ వర్షానికి అతలాకుతలమైన సరూర్‌నగర్‌ ప్రాంతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. వర్షంలో తడుస్తూ, వరద నీటిలో నడుస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించి.. మంచినీరు, ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు.అటు.. ఎల్బీనగర్‌లోని సాగర్‌ రింగ్‌రోడ్‌లో ఓ జంట బైక్‌పై వెళుతూ వరద ప్రవాహంలో చిక్కుకుంది. అదృష్టవశాత్తూ ట్రాఫిక్‌ పోలీసులు వారిని గుర్తించి కాపాడారు. లేదంటే వారిద్దరూ వరద ప్రవాహంలో కొట్టుకుపోయేవారు.

ఇక.. హైదరాబాద్‌లో మరోసారి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఉప్పల్‌లో 8.2, సరూర్ నగర్‌లో 8.1, నాగోల్‌లో 7.8, లింగోజి గూడలో 7.3, హస్తినాపురంలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనస్థలిపురంలో 5.7, రాజేంద్ర నగర్‌లో 4.8, ఎల్.బి.నగర్‌లో 4.6, ఉప్పల్‌లోని శాంతి నగర్‌లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సమీక్షిస్తున్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాండూరు - జహీరాబాద్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హన్మాపూర్‌ - జైరాం తండాల మధ్య కాలువ దాటుతుండగా.. వరదలో ఓ ఆటో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు.. ఆటోలోని ప్రయాణికులను కాపాడారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ రైల్వే కమాన్ కింద వరద నీటిలో మునిగిపోయాయి వాహనాలు.

ఇక వివిధ ప్రాజెక్టులకు కూడా వరద ఉధృతి కొనసాగుతోంది.. నాగార్జుసాగర్‌ ఇన్‌ఫ్లో 2లక్షల 50వేల 911 క్యూసెక్కులుగా ఉంది. 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. అటు.. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా వస్తుంది. దీంతో 32 గేట్లు ఎత్తారు అధికారులు. ఇవాళ కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఐదు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని.. కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరో రెండు మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు. సీఎం ఆదేశాలతో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story