Heavy Rains: హైదరాబాద్‌పై గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్..

Heavy Rains: హైదరాబాద్‌పై గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్..
Heavy Rains: గులాబ్‌ తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లోని పలుచోట్ల కుండపోత వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడింది.

Heavy Rains: గులాబ్‌ తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లోని పలుచోట్ల కుండపోత వాన కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో రోడ్లు చెరువుల్ని తలపిస్తుండటంతో జన జీవనం స్తంభించింది. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌, పోలీసులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు.

గులాబ్‌ తుపాను హైదరాబాద్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌లో పలుచోట్ల మళ్లీ భారీ వర్షం కురిసింది. కోఠి, పాతబస్తీ, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, బోరబండ, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో కుండపోత వాన పడింది. జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్‌, అంబర్‌పేట్‌, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఖైరతాబాద్‌లో రోడ్డుపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వాన కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శంషాబాద్‌ సమీపంలోని బుద్వేల్‌ రైల్వే అండర్‌ పాస్‌ వంతెనకు వరద ముంచెత్తింది. కాటేదాన్‌-శంషాబాద్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. యూసుఫ్‌గూడ రహదారిపై నడుము లోతు నీరు చేరింది. కూకట్‌పల్లిలో రహదారులపైకి వరదనీరు చేరింది. మాదాపూర్‌లో రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్‌రామ్‌గూడ, కొండాపూర్‌లో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల వాహనాల్ని మళ్లించారు.

భారీ వర్షాలతో ఉస్మాన్‌సాగ‌ర్ జ‌లాశ‌యానికి భారీగా వ‌ర‌ద వస్తోంది. జ‌లాశ‌యం పూర్తిస్థాయి నీటి మ‌ట్టానికి చేరుకోవడంతో.. నాలుగు గేట్లను ఒక అడుగు ఎత్తి 480 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్‌సాగ‌ర్‌ జ‌లాశ‌యానికి 350 క్యూసెక్కుల వరద వస్తోంది. మూసీ పరీవాహన ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు.

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్‌ రెస్పాన్స్‌పోర్స్ సహాయ చర్యలు ముమ్మరం చేసింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది మ్యాన్ హోల్స్‌ను తెరిచి రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అటు.. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నుంచి తుపాను పరిస్థితిని ఆమె పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలోనూ పర్యటించి వివరాలు తెలుసుకుంటున్నారు. నీళ్లు నిలిచిన ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు.

హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ అధికారుల్ని ఆదేశించారు. భారీ వర్షాల దృష్ట్యా ఆయన మున్సిపల్‌ అధికారులతో సమీక్షించారు. మొబైల్‌ అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజలు సమస్యలపై కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 040-21111111కు తెలియచేయాలని సూచించారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌లోనూ 040-23202813 నెంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

రెండు రోజులు భారీ వర్షాలు అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ సూచించారు. సమస్యలపై డయల్ ‌100కు కాల్‌ చేయాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం సత్వరమే స్పందించేలా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. సహాయం కోసం కంట్రోల్‌ రూమ్‌ కంట్రోల్‌ రూమ్‌లోని 9490617100, 8331013206, 040-278534183, 04027853412 నెంబర్లకు కాల్‌ చేయాలని సూచించారు. పురాతన, బలహీనమైన భవనాలు, కట్టడాలు, గోడలకు దూరంగా ఉండాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు. అత్యవసర సహాయం కోసం డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story