MEDARAM: పులకించిన మేడారం..గద్దెలపైకి సమ్మక్క

MEDARAM: పులకించిన మేడారం..గద్దెలపైకి సమ్మక్క
సమ్మక్క-సారలమ్మల జాతరలో కీలకఘట్టం ఆవిష్కృతం... గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలికిన ఎస్పీ

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిచెందిన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరలో కీలకఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఈ సాయంత్రం చిలకలగుట్ట వద్ద... ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు కుంకుమభరిణే రూపంలో ఉన్న సమ్మక్క అమ్మవారిని కిందకు తీసుకొచ్చారు. సమ్మక్క ఆగమనానికి సూచనగాములుగు ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం పలికారు. కుంకుమభరిణే రూపంలో ఉన్న సమ్మక్క అమ్మవారిని తీసుకొని, పూజారులు మేడారం గద్దెల వైపు బయలుదేరారు. కాసేపట్లో గిరిజన సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని గద్దెపై ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, జంపన్నలను గద్దెలపై ప్రతిష్టించారు. సమ్మక్క రాకతో వనదేవతలంతా గద్దెలపై కొలువుదీరి భక్తకోటికి దర్శనమిస్తున్నారు. వనదేవతల దర్శనానికి తెలుగు రాష్ట్రాలతోపాటు చత్తీస్ గడ్, మహారాష్ట్ర నుంచి జనం తరలిరావడంతో మేడారం జనసంద్రాన్ని తలపిస్తోంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు, అనంతరం అమ్మవార్లకు బంగారం మొక్కులు చెల్లించుకుంటున్నారు.


సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో జనజాతర మేడారం పులకించిపోతోంది. అశేష జనవాహినితో కీకారణ్యం కొత్త శోభను సంతరించుకుంది. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు భక్తులకు అభయమిస్తున్నారు. కోట్లాది భక్తుల ఇలవేల్పులకు పసుపు, కుంకుమ, నిలువెత్తు బంగారాలు సమర్పిస్తున్నారు. అశేష జనవాహినికి అభయమిచ్చేందుకు సమ్మక్క తల్లీ గద్దెలపై కొలువుదీరనున్నారు.


మేడారంలో సారలమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి... నిలువెత్తు బంగారం సమర్పించారు. మేడారం జాతరపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్న కిషన్‌రెడ్డి... జాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తానన్నారు. ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది నుంచే ప్రవేశాలకు అనుమతిస్తామని... ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇస్తామని హామీ ఇచ్చారు.


మేడారం జాతరకు వస్తున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. వైద్య బృందాలు, పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. మరోవైపు జాతరకు వచ్చేందుకు ఇప్పటికే RTC మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు భారీగా బస్సులను అందుబాటులోకి తెచ్చింది. మేడారం భక్తులకు హెలిటాక్సీ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. కాజీపేట సెయింట్ గ్యాబ్రిల్ స్కూల్ నుంచి భక్తులను తీసుకెళ్తున్నారు. ఒకేసారి ఆరుగురు ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉంది. మేడారంలోనూ 8 నిముషాల పాటు జాయ్ రైడ్ సదుపాయం కల్పిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story