TG: తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్‌ వినియోగం

TG: తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్‌ వినియోగం
మార్చిలోనే మే నెల విద్యుత్‌ డిమాండ్‌... అప్రమత్తమైన అధికారులు

తెలంగాణలో మార్చి నెలలోనే ఎండలు భగభగలాడటంతో.. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. విద్యుత్ వినియోగం పైపైకి వెళ్తోంది. వ్యవసాయంతోపాటు, పరిశ్రమలు, గృహ అవసరాలకు కరెంటు వాడకం రికార్డ్ స్థాయిలో పెరుగుతోంది. మే నెలలో రావాల్సిన విద్యుత్ డిమాండ్.. మార్చి నెలలోనే రావడంతో.. విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. అధికారులు నిరంతరం సమీక్షలు చేస్తూనే.. క్షేత్ర స్థాయిలో పరిశీలనలు చేస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరాపై దృష్టి సారించారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకూ భారీగా పెరిగిపోతుంది. ఒకవైపు వ్యవసాయం కోసం వాడకం మరోవైపు పరిశ్రమలు, గృహ అవసరాలకు విద్యుత్‌ను భారీగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.


గత ఏడాది మే నెలలో 15వేల 497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. ఈసారి మార్చి నెలలోనే 15,623 మెగావాట్ల అత్యధిక డిమాండ్ ఏర్పడింది. రాబోయే నెలల్లో 16,500ల మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తుంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో డిమాండ్ భారీగా ఉంది. సాధారణంగా ప్రతిఏటా 8 నుంచి 10శాతం మాత్రమే విద్యుత్ వినియోగం జరుగుతుంది. కానీ..ఈసారి అంచనాలకు మించుతోందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. డిమాండ్ ఎంత పెరిగినా తట్టుకునేందుకుగాను అదనపు లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, ఇతర అవసరమైనవన్నీ... ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు

విద్యుత్ అవసరాలు అందుకు తగిన చర్యలపై CMDలు నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్ల అవసరాలు, 33కేవీ, 11కేవీ సబ్ స్టేషన్ లు, ఫీడర్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో CMD ముషారఫ్ ఫారూఖీ ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. పీక్ అవర్స్ ముగిసేవరకు అన్ని విభాగాల అధికారులు విధుల్లోనే అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారని.. అధికారులు చెబుతున్నారు. SPDCL పరిధిలో విద్యుత్‌ వినియోగం రికార్డుస్థాయిలో నమోదు అవుతోందని.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story