TS: ప్రజా వాణికికు అనూహ్య స్పందన

TS: ప్రజా వాణికికు అనూహ్య స్పందన
భారీగా తరలివస్తున్న ప్రజలు.... సమస్యలపై పోటెత్తిన ఫిర్యాదులు

తెలంగాణలో ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించే ప్రజావాణి కార్యక్రమానికి అనుహ్య స్పందన వస్తోంది. అధికారులకు తమ గోడును విన్నవించుకోవడానికి అర్జీదారులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు. రెండు పడకగదుల ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపిన అధికారులు... దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సమస్యలపై ఫిర్యాదులు పోటెత్తాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హాజరైన ప్రజలు తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన అధికారులు... పరిష్కరానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అర్జీదారులను ప్రత్యేక క్యూలైన్లలో ప్రజాభవన్లోకి అనుమతించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీల్ చైర్లలో సిబ్బంది వారిని లోనికి తీసుకువెళ్లారు.


తెలంగాణలోని ఆయా జిల్లాల నుంచి హాజరైన ప్రజలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. పింఛన్లు , భూ సమస్యలపై ఎక్కువ అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. తన సమస్యను పరిష్కారించాలని కోరుతూ ప్లకార్డుతో నిల్చున్న అర్జీదారుని చూసి ప్రజాభవన్ నుంచి బయటకు వెళ్తున్న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కారును ఆపారు. సమస్యపై ఆరాతీసి... అతని నుంచి అర్జీని స్వీకరించారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజాభవన్‌కు తరలివచ్చారు. ప్రతినెల 10 వ తేదీలోగా మెస్‌ బిల్లులు, జీతాలు చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. జీవో నెం 46ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రంలో పలుజిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు వచ్చారు. గత ప్రభుత్వం తమపట్ల నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుత ప్రభుత్వమైనా తమకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.


ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన GHMC కమిషనర్ రోనాల్డ్‌రోస్‌... స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాభవన్ ఎదుట ఉన్న రహదారిపై రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story