Top

హైదరాబాద్‌లో వందల అపార్ట్‌మెంట్ల పరిస్థితి అధ్వానంగానే..

హైదరాబాద్‌లో వందల అపార్ట్‌మెంట్ల పరిస్థితి అధ్వానంగానే..
X

ప్రతీకాత్మక చిత్రం

రాజధాని నగరంలోని పలు కాలనీలు, బస్తీలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. వాన తగ్గి ఐదు రోజులైనా నీరు అలానే ఉంది. పల్లంలో ఉన్న ఇళ్ల నుంచి నీరు బయటకు వెళ్లడం లేదు. పలు అపార్ట్‌మెంట్‌లు, భవనాల సెల్లార్‌లు సమస్యాత్మకంగా మారాయి. సెల్లార్‌లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఇళ్లల్లో చిక్కుకున్న వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విద్యుత్‌ సరఫరా లేక ఫోన్లు పని చేయలేదు. నిచ్చెన, తాళ్లను ఆధారంగా చేసుకుని రోడ్డు మీదకు వస్తున్నారు. ఆ అవకాశం లేనివాళ్లు ఫ్లాట్‌కే పరిమితం అయ్యారు. సెల్లార్‌లో నీళ్లు ఉండడంతో కరెంటు పునరుద్ధరించలేదు. సెల్లార్‌లో నీటి బయటకు తీద్ధామంటే డీజిల్‌ ఇంజన్‌ మోటర్లు దొరకడంలేదు.

హైదరాబాద్‌లో వందల అపార్ట్‌మెంట్ల పరిస్థితి అధ్వానంగానే కొనసాగుతోంది. నీటి సంపులన్నీ దుర్గంధంగా మారాయి. సెల్లార్లలోని నీటిని తోడేందుకు 24 గంటల పాటు డీజిల్‌ ఇంజన్లను నడుపుతున్నారు. ఒక్కో అపార్ట్‌మెంట్‌కు 10 వేల నుంచి 25 వేల రూపాయలవరకు అద్దె వసూలు చేస్తున్నారు. అవి కూడా దొరక్కపోవడంతో విద్యుత్‌ మోటర్లను 10 వేల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. సెల్లార్‌లోకి చేరిన నీళ్లను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగిస్తారని ఎదురుచూసిన అపార్ట్‌మెంట్‌ వాసులకు నిరాశ ఎదురవుతోంది. గ్రేటర్‌ మాన్‌సూన్‌ బృందాల దగ్గర, డీఆర్‌ఎఫ్‌ బృందాల వద్ద పెద్దఎత్తున డీజిల్‌ ఇంజన్లు ఉన్నాయి. కానీ వారు.. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు మాత్రమే డీజిల్‌ ఇంజన్లను వాడుతున్నారు.

మణికొండ పుప్పాలగూడ గోల్డెన్‌ టెంపుల్‌ ప్రాంతంలో పందెన్‌వాగు పక్కనున్న పలు అపార్ట్‌మెంట్లలో నాలుగు రోజులుగా కరెంటు లేదు. అద్దె ఇళ్లలో ఉండేవాళ్లు ఖాళీచేసి వెళ్లిపోతున్నారు. సెల్లార్‌లో చేరిన బురద దుర్వాసన వెదజల్లుతుండటంతో అనారోగ్య సమస్యలు వస్తాయని బెంబేలెత్తిపోతున్నారు. నీటిలో మునిగిన విద్యుత్‌ మీటర్లను డ్రయ్యర్లతో ఆరబెట్టిన తర్వాతే కరెంట్‌ సరఫరా పునరుద్దరించగలమని విద్యుత్‌ అధికారులు తేల్చిచెప్పారు.

Next Story

RELATED STORIES