భార్య శవాన్ని భుజాన వేసుకుని మూడున్నర కిలోమీటర్ల ప్రయాణం..!

భార్య శవాన్ని భుజాన వేసుకుని మూడున్నర కిలోమీటర్ల ప్రయాణం..!
భార్య శవాన్ని భుజాన వేసుకుని ఓ భర్త మూడున్నర కిలోమీటర్లు నడిచాడు. ఆమె అంత్యక్రియలు పూర్తి చేసేందుకు పడరాని పాట్లు పడ్డాడు.

భార్య శవాన్ని భుజాన వేసుకుని ఓ భర్త మూడున్నర కిలోమీటర్లు నడిచాడు. ఆమె అంత్యక్రియలు పూర్తి చేసేందుకు పడరాని పాట్లు పడ్డాడు. కరోనా రక్కసి మానవత్వాన్ని కూడా చంపేస్తున్న దారుణమైన పరిస్థితుల్లో.. ఈ ఘటన అందరి హృదయాల్ని కలచి వేస్తోంది. ఈ విషాదం కామారెడ్డి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది.

నాగలక్ష్మి, స్వామి భార్యాభర్తలు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగలక్ష్మి చివరికి కన్నుమూసింది. ఐతే.. ఆ మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఆమె కోవిడ్‌తోనే చనిపోయిందనే భయంతో ఆటోడ్రైవర్లు డెడ్‌బాడీ తీసుకెళ్లేందుకు నిరాకరించారు. అంత్యక్రియలు జరిపించేందుకు రైల్వే పోలీసులు విరాళాలైతే పోగుచేసి ఇవ్వగలిగారు కానీ.. ఆటో డ్రైవర్లను డెడ్‌బాడీ తీసుకువెళ్లేందుకు ఒప్పించలేకపోయారు.

ఇలాంటి కష్టకాలంలో మున్సిపల్ సిబ్బంది సాయం కోరాలా.. ఏం చేయాలో స్వామికి అర్థం కాలేదు. చివరికి విధిలేని పరిస్థితుల్లో స్వామి తన భార్య మృతదేహాన్ని భుజానా వేసుకుని దాదాపు మూడున్నర కిలోమీటర్లు నడిచాడు. తర్వాత అక్కడ అంతిమ సంస్కారాలు పూర్తి చేశాడు.

భర్త తన భార్య డెడ్‌బాడీని భుజాన వేసుకుని తీసుకువెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సాటి మనిషి అంతులేని కష్టంలో ఉన్నా.. కళ్లముందే సాయం కోసం ఎదురు చూస్తూన్నా.. మేమున్నామంటూ ఆ నలుగురూ కూడా ముందుకు రావడానికి తటపటాయించే పరిస్థితుల్లోకి ఈ సమాజాన్ని నెట్టేసింది కరోనా వైరస్. ఇప్పటికే ఇలాంటివి పలుచోట్ల జరిగినా.. ఈ తాజా ఘటన మరోసారి కరోనా విలయతాండవానికి కేరాఫ్‌లా కనిపించింది.

Tags

Read MoreRead Less
Next Story