Huzurabad By Election: క్లైమాక్స్‌కు చేరిన ఉప ఎన్నిక ఫైట్.. ప్లాన్స్‌తో సిద్ధమైన పార్టీలు..

Huzurabad By Election: క్లైమాక్స్‌కు చేరిన ఉప ఎన్నిక ఫైట్.. ప్లాన్స్‌తో సిద్ధమైన పార్టీలు..
Huzurabad By Election: తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫైట్ క్లైమాక్స్ కు చేరుకుంది.

Huzurabad By Election: తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫైట్ క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రచారానికి నేటితో తెరపడనుంది. రాజకీయ పార్టీలు.. ప్రచారం చేసుకోవడానికి మరికొన్ని గంటలే మిగిలిఉన్నాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచార హోరు ఈ సాయంత్రం ఏడు గంటల తర్వాత మూగబోనుంది.

దీంతో ప్రధాన పార్టీలు చివరినిమిషం వరకు వీలైనంత ప్రజలను కలుసుకునేలా ప్రచారాన్ని ప్లాన్‌ చేసుకున్నాయి. ఆఖరురోజు ప్రచారాన్ని ఘనంగా ముగించాలని టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు నిర్ణయించాయి. వీలైనన్ని రోడ్‌షోలు నిర్వహించనున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు స్థానికేతరులంతా నేటి సాయంత్రానికల్లా నియోజకవర్గం వీడాల్సి ఉంటుంది.

దీంతో హుజూరాబాద్‌లో సందడి తగ్గనుంది. ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపకుండా ముందు జాగ్రత్తగా ఈసీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. దాదాపు ఐదు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వివిధ పార్టీల నేతలు వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. జూన్‌ 12న ఈటల రాజేందర్‌ రాజీనామా తర్వాత రోజు నుంచి హుజూరాబాద్‌లో బీజేపీ– టీఆర్‌ఎస్‌లు ప్రచారం మొదలుపెట్టాయి.

ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఎన్నికల నోటిఫికేషన్‌ కు ముందే ప్రచారాన్ని హోరెత్తించారు. నోటిఫికేషన్‌కు ముందు ఒక దఫా గడపగడపకు వెళ్లిన ఇరు పార్టీలు ఎన్నికల తర్వాత ప్రచారాన్ని పీక్‌ స్టేజ్‌ కు తీసుకెళ్లాయి. లేట్‌ గా అయినా లేటెస్ట్‌గా అన్నట్లు కాంగ్రెస్‌ కూడా ప్రచార గోదాలోకి ఆలస్యంగా అడుగుపెట్టినా చివరికొచ్చేసరికి ఊపు పెంచింది.

నాలుగున్నర నెలల విమర్శల సంగ్రామానికి నేటి సాయంత్రంతో ముగింపు పడనుంది. ఇక ప్రలోభాల పర్వానికి తెరలేవనుంది. ఇప్పటికే నాలుగైదు నెలలుగా పలు పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక తాయిలాలు, విందులు, వినోదాలు, బహుమతులు అందజేశాయి. కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో గతంలో 48 గంటలుగా ఉండే సైలెన్స్‌ పీరియడ్‌ ఈసారి 72 గంటలుగా ఈసీ నిర్ణయించింది. ఈ 72 గంటల్లో మద్యం, నగదు పంపిణీకి దిగే పార్టీలు, నేతలపై పోలీసులు దృష్టి సారించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story