Hyderabad: మెట్రోకు కేంద్రం నిధులు.. ఈసారైనా అమలయ్యేనా..!

Hyderabad: మెట్రోకు కేంద్రం నిధులు.. ఈసారైనా అమలయ్యేనా..!
కేంద్ర బడ్జెట్‌ పై భారీగా ఆశలు పెట్టుకున్న తెలంగాణ

కేంద్ర బడ్జెట్‌ పై తెలంగాణ రాష్ట్రం భారీగా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా మెట్రో నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో నిధులు విడుదల చేస్తుందనే ఆశలతో ఉంది. గత నాలుగేళ్లుగా కేంద్రం నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇతర రాష్ట్రాల మెట్రోలకు ప్రతి బడ్జెట్‌లో పెద్దపీట వేస్తున్న మోదీ సర్కారు హైదరాబాద్‌ మెట్రోకు ఇప్పటిదాకా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని మండిపడుతుంది. తాజా బడ్జెట్‌ నిధులు కేటాయింపుల్లో హైదరాబాద్‌ మెట్రోకు స్థానం దక్కుతుందనే ఆశాభావంలో ఉంది.

2007లో మొదలైన పీపీపీ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. మూడు మార్గాల్లో 69 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుకు జనం నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రస్తుతం రోజుకు నాలుగున్నర లక్షల మందికిపైగా ప్రయాణికులు మెట్రోను వినియోగించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గం-శంషాబాద్‌ విమానాశ్రయానికి 31 కిలోమీటర్ల ఎయిర్‌పోర్టు మెట్రోను కూడా చేపట్టింది. మెట్రో రెండో దశకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది.

మెట్రో మొదటి దశకు సంబంధించి వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ బకాయిల్ని కేంద్రం గత నాలుగేండ్లుగా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. 14వేల ఒక వంద కోట్లతో పబ్లిక్‌-ప్రైవేట్‌-పార్ట్‌నర్‌షిప్‌గా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు పది శాతం నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంటుంది. అంటే సుమారు 14వందల 58 కోట్ల మొత్తాన్ని కేంద్రం వీజీఎఫ్‌ కింద సమకూర్చేందుకు అప్పట్లో అంగీకారం తెలిపింది. అయితే నాలుగు సంవత్సరాలుగా బకాయిగా ఉన్న 254 కోట్లను మాత్రం కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపిస్తుంది. ఈ బడ్జెట్‌లోనైనా కేంద్రం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story