Hyderabad: లేడీ సింగం... చారు సిన్హా...

Hyderabad: లేడీ సింగం... చారు సిన్హా...
హైదరాబాద్ ఇన్స్పెక్టర్ జెనరల్ గా నియమితురాలైన చారు సిన్హా; నాలుగు సీఆర్పీఎఫ్ సెక్టార్లకు నాయకత్వం వహించనున్న లేడీ బాస్..

హైదరాబాద్ కు కొత్త పోలీస్ బాస్ వచ్చారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు ఇన్స్పెక్టర్ జెనరల్ (IG)గా నియమితులైన తొలి మహిళగా చారు సిన్హా రికార్డ్ సృష్టించారు. మంగళవారం హైదరాబాద్ లోని దక్షిణ సెక్టార్ లో పారామిలటరీ దళానికి నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించారు. 2020 సెప్టెంబర్ లో శ్రీనగర్ లోని సీఆర్పీఎఫ్ దళానికి ఐజీగా బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళగా చారు నిలిచారు. రెండేళ్ల ఆమె నాయకత్వంలో 69 తిరుగుబాటు వ్యతిరేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. 21 మంది తీవ్రవాదులను మట్టుబెట్టారు. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్, గండేర్బాల్ జిల్లాల్లో 22వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లతో కూడిన 22 బెటాలియన్ లకు నాయకత్వం వహించిన ఘనత ఆమె సొంతం. సీఆర్పీఫ్ తోపాటూ , జమ్మూకాశ్మీర్ పోలీస్ విభాగానికి సంయుక్తంగా నాయకత్వం వహిస్తూ లష్కరే తైబా కమాండర్ సలీమ్ పార్రేతో పాటూ మరో విదేశీ తీవ్రవాదిని సైతం మట్టుబెట్టిన ఉక్కు మహిళగానూ ఆమె కీర్తి గడించారు. ఈ రకమైన సంయుక్త దళానికి ఓ మహిళ నాయకత్వం వహించిడం ఇదే మొదలు కావడం మరో విశేషం. 1996 బ్యాచ్ కు చెందిన ఈ పోలీస్ ఆఫీసర్... బీహార్ లోని యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లలోనూ కీలకలంగా వ్యవహరించారు. కోవిడ్ మహమ్మారి దేశాన్ని చుట్టేసినప్పుడు అమర్నాథ్ యాత్రలో భధ్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఇతర పోలీస్ ఆఫీసర్లకు సిన్హా వ్యవహారశైలి ఎంతో భిన్నమని ఆమెతో కలసి పనిచేసిన వారు చెబుతారు. తన పరిపాలనా దక్షతలో మానవత్వానికి, మనోభావాలకు పెద్ద పీట వేయడం ఆమెకే చెల్లింది. ఆర్టికల్ 370 రద్దైననప్పుడు కీలకమైన ప్రాంతాల్లో సిన్హా అంకుటిత ధైర్యంతో సేవలు అందించారు. కాశ్మీర్ లోని ఆమె పోస్టింగ్ లో ఉన్న సమయంలో యువత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. స్వయం ఉపాధి దిశగా యువతను ప్రోత్సహించేందుకు ఎంతగానో కృషి చేశారు. ఇక 2021లో సెర్చ్ ఆపరేషన్లలో పాలుపంచుకునే సీఆర్పీఎఫ్ జవాన్లకు సిన్హా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల్లో భాగంలా ఇళ్లలోకి వెళ్లేటప్పుడు షూ కవర్లు వాడాల్సిందిగా సిన్హా సూచించారు. తద్వారా ఇంటి యజమానుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయిని, అంతేగాక కొన్ని ఇళ్లలో కార్పెట్లు ఉంటాయని, అవి ఖరీదైనవి కూడా కావచ్చని షూ కవర్లు వేసుకోవడం వల్ల వాటికి, ఇంటి వారికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తపడవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక సీఆర్పీఎఫ్ జవాన్లలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు గానూ సిన్హా శ్రీకారం చుట్టిన లవ్ యూ జిందగీ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. కుటంబాలకు దూరంగా గడుపుతూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న జవాన్లలో నూతనోత్తేజం నింపేందుకు ఈ కార్యక్రమం సహకారం అందిస్తుంది. ఏమైనా ఘనమైన కీర్తి ప్రతిష్ఠలు కైవసం చేసుకున్న చారు సిన్హా నగరానికి విచ్చేయడం సిఆర్పీఎఫ్ దళాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఆమె నాయకత్వంలో నగరంలోనూ భారీ మార్పులు చోటుచేసుకుంటాయేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story