Top

ఎక్కడో వాయుగుండం.. ఎఫెక్ట్‌ అంతా హైదరాబాద్‌ నగరంపై

ఊరు ఏరైంది.. కాలనీలు చెరువులను తలపించాయి.. కుండపోత వర్షంతో పోటెత్తిన వరద నీరంతా రోడ్లను, కాలనీలను ముంచెత్తింది.. మొత్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో..

ఎక్కడో వాయుగుండం.. ఎఫెక్ట్‌ అంతా హైదరాబాద్‌ నగరంపై
X

ఊరు ఏరైంది.. కాలనీలు చెరువులను తలపించాయి.. కుండపోత వర్షంతో పోటెత్తిన వరద నీరంతా రోడ్లను, కాలనీలను ముంచెత్తింది.. మొత్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్‌ నగరం అతలాకుతలం అయిపోయింది.. మూడు రోజుల నుంచి ముసురు పట్టగా.. నిన్న సాయంత్రం సమయంలో జోరువాన కురిసింది.. అది కుండపోతగా మారి అర్థరాత్రి వరకు తన ప్రతాపాన్ని చూపించింది..10 సెంటీమీటర్ల వర్షం కురిస్తే హైదరాబాద్‌ నగరం మునిగిపోతుంది.. అలాంటిది 30 సెంటీమీటర్ల వర్షం కురిస్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.. ఎక్కడో వాయుగుండం తీరం దాటితే ఆ ఎఫెక్ట్‌ అంతా హైదరాబాద్‌ నగరంపై చూపించింది.. నగరంలో కుంభవృష్టి కురిసింది.. సిటీ మొత్తం ఏరులా మారిపోయింది. కాలనీలకు కాలనీలే మునిగిపోయాయి.. రోడ్లపై నడుముల్లోతు నీళ్లు చేరాయి.

భారీవర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్నాయి.. నిన్నటి నుంచి వదలకుండా కురుస్తున్న వానకు.. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. చాలా చోట్ల అపార్ట్‌మెంట్ల సెల్లార్లు మునిగిపోయాయి. ఘట్‌కేసర్‌లో రికార్డు స్థాయిలో 31.9సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో 29.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్‌నగర్‌లో 24, ఉప్పల్‌లో 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది.. మేడిపల్లి, కీసరలో 20 సెంటీమీటర్లు, బండ్లగూడలో 20, ముషీరాబాద్‌లో 19.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజాంపేట్‌, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌, సైదాబాద్‌, రాజేంద్రనగర్‌, మలక్‌పేట్‌, టోలిచౌకి, ఉస్మాన్‌ గంజ్‌, ఎల్బీనగర్‌, అంబర్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, పాతబస్తీ, జీడిమెట్ల, చంపాపేట్‌, మలక్‌పేట్‌ గంజ్‌ ప్రాంతాలు నీటమునగడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు..

కాలనీలను వర్షం నీరు ముంచెత్తడంతో జనం రోడ్డున పడ్డారు.. వరద ఉధృతితో కొన్ని ప్రాంతాల్లో పడవల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. టోలిచౌకి నదీమ్‌ కాలనీలో ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరింది.. దీంతో స్థానిక జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ సిబ్బంది, స్థానిక ఎమ్మెల్యే ప్రజలను పడవలు, ట్యూబుల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎల్బీనగర్‌లో వందకుపైగా కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి. బేగంపేట నాలా పోటెత్తడంతో బ్రాహ్మణవాడి, మయూరి మార్గ్‌, అల్లంతోట బావి బస్తీల్లో వుంటున్న ప్రజలు రాత్రంతా భయం భయంగా గడిపారు. ఓల్డ్‌ మలక్‌పేట శంకర్‌నగర్‌లో ఓ పాత భవనం కూలిపోయింది. ఇది పూరాతనమైనది కావడంతో.. వర్షానికి తడిసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది.

అటు నగరంలో 44 కిలోమీటర్ల పరిధిలో ప్రవహిస్తున్న మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో దాదాపు 1,500 వందల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన నాలాలు ఉప్పొంగాయి. వరద, మురుగునీరు పోటెత్తడంతో సుమారు 7 వేల కిలోమీటర్ల పరిధిలోని డ్రైనేజీపై ఉన్న ఉన్న పైప్‌లైన్‌ల మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో హిమాయత్‌సాగర్‌ రెండు గేట్లు ఎత్తి 1,300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. వందలాది బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులపై నడుము లోతున నీరు పోటెత్తింది. పలు బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు బస్తీవాసులు నానా అవస్థలు పడ్డారు. చెరువులు, కుంటలను ఆనుకుని ఉన్న బస్తీల్లో వరద ఉధృతి అధికంగా ఉండటంతో బస్తీల వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు మోటార్లు, జెట్టింగ్‌ యంత్రాల సాయంతో తొలగిస్తున్నాయి. వర్ష బీభత్సానికి పాతనగరం సహా పలు ప్రాంతాల్లో శిథిల భవనాలు, చెట్లు నేలకూలాయి.

విద్యుత్‌ వైర్లు ఓ వ్యక్తి ప్రాణం తీశాయి.. నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో లిక్కర్ ఇండియా కంపనిలో పని చేస్తున్న ఫణి కుమార్ అనే వ్యక్తి విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా మానిక్ చంద్ చౌరస్తా వద్ద హై టెన్షన్ వైర్లు తగిలి మృతి చెందాడు.. దీంతో అప్రమత్తమైన విద్యుత్‌ అధికారులు పవర్‌ కట్‌ చేశారు.. భారీ వర్షాలతో వరద ముంచెత్తడంతో ముందు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు అధికారులు. నిన్న సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు నగరంలోని 90 శాతం ప్రాంతాల్లో పవర్‌ కట్‌ కొనసాగింది.. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. మరోవైపు హైదరాబాద్‌లో కుంభవృష్టి నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. చెట్లు, కటౌట్లు, హోర్డింగ్‌ల కింద ఎవరూ ఉండొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్, తేజస్వి నగర్ కాలనీ, సాయి కాలనీలోకి భారీగా వరద నీరు చేరడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న కార్పొరేటర్‌కు, జిహెచ్ఎంసి అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని మలిశెట్టి గూడలో గోడ కూలి తల్లీకూతురు మృతిచెందారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని చింతల్‌, జీడిమెట్ల, గాజులరామారం, జగద్గిరిగుట్టలో కాలనీలు చెరువులను తలపించాయి.. ఇక మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో వరద ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో పరిస్థితి చేయిదాటిపోయిందని గ్రేటర్‌ అధికారులు చెబుతున్నారు. ఎవ్వరూ అనవసరంగా బయటికి రావొద్దని.. ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచిస్తున్నారు. ఇక డిప్యూటీ మేయర్‌ ఫసియుద్దీన్‌ నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా తెలుసుకుంటున్నారు.. జీహెచ్‌ఎంసీ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి నిరంతరం సమీక్షిస్తున్నారు.. అటు జీహెచ్‌ఎంసీ సిబ్బంది, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు రాత్రంతా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి..

ఇక హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వరద పరిస్థితులను ఎప్పటి కప్పుడు అధికారులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. బీజేపీ కార్యకర్తలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.ఇవాళ కూడా భారీవర్షం కురిసే హెచ్చరికలు ఉండడంతో.. నగరవాసులకు కష్టాలు తప్పేలా లేవు. చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ బ్లాక్ అవడంతో.. GHMC రెస్క్యూ టీమ్‌లు రాత్రంగా వాటిని క్లియర్ చేస్తూనే ఉన్నాయి. అయినా కొన్ని చోట్ల రోడ్లపై నిలిచిన నీరు తగ్గలేదు. మరో 3 రోజులు వర్షాలు ఇదే స్థాయిలో ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో నగరవాసులు ఆందోళన పడుతున్నారు.

మరోవైపు తీవ్ర వాయుగుండం తూర్పు ఈశాన్య దిశగా ప్రయాణించి ఖమ్మం జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అక్కడి నుంచి మధ్య మహారాష్ట్ర యరత్వాడ వైపు వెళ్లనుంది. ఈరోజు సాయంత్రానికి వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Next Story

RELATED STORIES