అందుకే హేమంత్‌ను హత్య చేయాల్సి వచ్చింది: నిందితులు

సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసు నిందితులను అన్ని కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు.. ప్రధాన నిందితులైన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్‌రెడ్డిలను చర్లపల్లి జైలు నుంచి గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆరు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు తొలిరోజే విచారణను ముమ్మరం చేశారు. మొదటి రోజు కస్టడీలో లక్ష్మారెడ్డి పలు విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. అవంతి ప్రేమ విషయం తెలిసి ఇంట్లో కట్టడి చేశామని. తప్పించుకొని వెళ్లి వివాహం చేసుకుంది. పోలీసుల ద్వారా విషయం తెలిసిందని.. ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించే కుటుంబం మాది. కాలనీలో తలెత్తుకొని తిరగలేక పోయామని అందుకే హేమంత్‌ను హత్య చేయాల్సి వచ్చిందని చెప్పినట్లు తెలిసింది. నిందితులతో పోలీసులు మరోసారి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. అవంతి పేరిట ఉన్న ఆస్తులను తిరిగి తండ్రికి రాసిచ్చినప్పటికీ ఎందుకు హత్య చేశారనే విషయమై ఆరా తీస్తున్నారు పోలీసులు.
మరోవైపు తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని హేమంత్ భార్య అవంతి సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు వినతిపత్రం అందించింది. అత్తామామలు లక్ష్మీరాణి, మురళీకృష్ణతో కలిసి ఆమె కమిషనర్‌ను కలిసి విజ్ఙప్తి చేసింది. హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని కోరారు. దీంతో హేమంత్ కుటుంబ సభ్యులకు పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీనిచ్చారు. హేమంత్ ఇంటివద్ద 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని చందానగర్ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక మహిళా కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. దీంతోపాటు హేమంత్ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com