TS: నేటి నుంచే కైట్‌ ఫెస్టివల్‌

TS: నేటి నుంచే కైట్‌ ఫెస్టివల్‌
ప్రత్యేక వేడుకలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం... తరలిరానున్న 100 దేశాల కైట్‌ ఫ్లైయర్స్‌

హైదరాబాద్‌లో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని తాకేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వేడుకలకు సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు సికింద్రాబాద్‌ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ పంతగులు, మిఠాయిల పండగలు నిర్వహిస్తోంది. 16 దేశాల నుంచి నిపుణులైన 100 మంది కైట్‌ ప్లైయర్స్ రకరకాల గాలిపటాలను వేడుకల్లో ఎగిరేయనున్నారు. స్థానిక మహిళలు తయారు చేసిన సుమారు 400 రకాల మిఠాయిలు వేడుకల్లో నోరూరించబోతున్నాయి. ఈ మధ్యాహ్నం 3 గంటల తర్వాత వేడుకలను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించనున్నారు.


సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుంది. కరోనాతో 2021 నుంచి నిలిచిన అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండగను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 15 వరకు ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సరదాల సంక్రాంతి ఉత్సవాల్లో ప్రజలకు కావల్సిన వినోదం సహా పసందైన రుచులు అందుబాటులో ఉండనున్నాయి. 16 దేశాల నుంచి నిపుణులైన అంతర్జాతీయ 40 మంది కైట్ ప్లేయర్, వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ ప్లేయర్స్ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. సాధారణ గాలిపటాల కన్నా భారీ పరిమాణంలోఉన్న వివిధ ఆకృతుల్లో తయారు చేసిన పతంగులు ఎగురవేయనున్నారు. రాత్రి వేళ ఎగిరే పతంగులు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.


2016-17లో అగా ఖాన్ అకాడమీలో పతంగుల పండగ నిర్వహించారు. ఆ తర్వాత మూడేళ్లు తెలంగాణ ప్రభుత్వం పరేడ్ మైదానంలో అధికారికంగా జరపగా భారీగా ప్రజలు హాజరయ్యారు. కరోనాతో మూడేళ్లు కైట్ ఫైస్టివల్‌కు నగరవాసులు దూరమయ్యారు. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం కావడంతో వేడుకలను పునరుద్దరించాలని నిర్ణయంచిన ప్రభుత్వం... ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేసింది. కైట్‌ ఫెస్టివల్ సహా ప్రాంతీయ కళలు, చేతివృత్తులు, తెలంగాణ వంటకాలతో కూడిన స్టాల్స్‌.. సందర్శకులకు నోరూరించనున్నాయి. ఇందుకోసం నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు అవకాశం కల్పించి ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇళ్ల వద్ద తయారు చేసిన 400 రకాల మిఠాయిలతోపాటు పిండివంటలు, తెలంగాణ వంటకాలను ఈ వేడుకల్లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే తెలంగాణ సంప్రదాయ కళా ప్రదర్శనలతో కళాకారులు ఉత్సవాలకు మరింత శోభను చేకూర్చనున్నారు. మూడు రోజులపాటు జరిగే వేడుకలకు దాదాపు 10 లక్షల మంది హాజరువుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం మెట్రో రైలు, RTC బస్సు సర్వీసులను అదనంగా పెంచారు. ఇలాంటి ఉత్సవాల ద్వారా పర్యాటకులను ఆకర్షించడంతోపాటు పర్యాటకంగా నగరం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story