హైదరాబాద్‌లో మెట్రో పరుగులు.. ఆ ఐదు స్టేషన్లలో మెట్రో సేవలు నిలిపివేత

హైదరాబాద్‌లో మెట్రో పరుగులు.. ఆ ఐదు స్టేషన్లలో మెట్రో సేవలు నిలిపివేత
ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తులను మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతిస్తారు.

మార్చి 22 తేదీ లాక్ డౌన్ నుంచి సుమారు ఐదు నెల‌లుగా మెట్రో రైళ్ల సేవ‌లు నిలిచిపోయాయి. కేంద్రం అన్ లాక్ ఫోర్‌లో భాగంగా దేశంలో మెట్రో రైళ్ల నిర్వ‌హ‌ణ‌కు అనుమతులు ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి హైదరాబాద్‌లో మళ్లీ ప్ర‌యాణికుల‌కు మెట్రో సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. మెట్రో రైళ్ల‌ పున ప్రారంభం కోసం తీసుకోవాల్సిన జాగ్ర‌త్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వీటికి అనుగుణంగా అవసరమైన అన్ని చర్యలు మెట్రో వర్గాలు తీసుకుంటున్నాయి. ప్రధానంగా సోషల్ డిస్టెన్సింగ్.. శాటిటైజర్స్ ఏర్పాటు చెయ్యడంతోపాటు ప్రత్యేక అనౌన్స్ మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు.

మెట్రో సర్వీసుల నిర్వ‌హణ‌లో అన్ని నిబంధనలు పాటిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. రైళ్లలో కరోనా వ్యాప్తి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. ఇద్దరి మధ్య ఓ సీటు గ్యాప్‌ ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే నిల్చునే వారికి సైతం ప్రత్యేకంగా మార్కింగ్‌ చేశామని తెలిపారు.

మూడు కారిడార్లలో మొదటి దశలో 7వ తేదీనా మియాపూర్ నుంచి ఎల్ బీ నగర్ వరకు సేవలు ప్రారంభం కానున్నాయి. రెండో దశలో 8వ తేది రోజు నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో పరుగులు పెడుతుంది. మొదటి రెండు రోజులు ఉదయం 7గంటల నుంచి 12గంటల వరకు... సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మెట్రో నడవనుంది. ఇక తొమ్మిదో తేదీ రోజు మిగిలిన మూడో కారిడార్ జేబిఎస్ నుంచి సిబిఎస్ వరకు ప్రారంభం కానుంది. 9వ తేది నుంచి అన్ని కారిడార్లలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటలవరకు మెట్రో సేవలు నడవనున్నాయి.

ఇక ఇప్పటి వరకు ఉన్న ఫ్రిక్వేన్సీ ప్రకారం కాకుండా రైళ్ల రాకపోకలకు కొత్త టైంటేబుల్ ప్రకటించారు మెట్రో అధికారులు. ప్రతి ఐదు నిముషాలకు ఒక రైలు నడపాలని నిర్ణయించారు. గతంలో ప్రతి మూడు నిముషాలకు రద్దీ ఎక్కువగా ఉంటే మరింత వేగంగా కూడా రైళ్లు పరుగులు పెట్టేవి. అయితే ఇప్పుడు రద్దీ పెరుగుదలను బట్టి ఫ్రీక్వెన్సీని పెంచుతామంటున్నారు అధికారులు. ప్రతి రైలులో గతంలో 1000మంది వరకు ప్రయాణం చేయగా ఇప్పుడు ఆ సంఖ్యను 300 కే పరిమితం చేసే అవకాశం ఉందంటున్నారు. మొదట 10 నుంచి 15వేల రద్దీ ఉంటుందని భావిస్తున్నామని... ఒక నెలలో లక్ష మందికి చేరే అవకాశం ఉందంటున్నారు అదికారులు. ఇక ఈ మూడు మార్గాల్లో కంటైన్మెంట్ జోన్లలో ఉన్న 5 స్టేషన్లలో మెట్రో సేవలను నిలిపివేశారు. గాంధీ ఆసుపత్రి, భరత్ నగర్, మూసాపేట్, ముషిరాబాద్, యూసఫ్ గుడా స్టేషన్లను పూర్తిగా మూసి ఉంచనున్నారు.


కేంద్ర ప్రభుత్వ నిభందనల ప్రకారం కోవిడ్ వ్యాప్తి నివారణకు పాటించాల్సిన స్టాండర్డ్ అపరేటింగ్ ప్రోడ్యూసర్ ను విడుదలచేసింది మెట్రో రైల్ ఎల్ అండ్ టి.. హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ డిస్టేన్స్ పాటించేందుకు రైలు తోపాటు స్టేషన్ పరిసరాల్లో ప్రత్యేకంగా మార్కింగ్ చేశారు. ఎక్కడ కూర్చోవాలి..., ఎక్కడ నిలబడ్డవారు ఎటువైపు మళ్లాలి అనే అంశాలను తెలియజేసే విధంగా మార్కింగ్ చేశారు. ప్రయాణికులు సిబ్బంది సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా అనే అంశాలను సిసిటివిల ద్వారా స్టేషన్ కంట్రోలర్, ట్రైన్ అపరేటర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఇక మాస్క్ లేని వారిని మెట్రోలోకి అనుమతించరు. అందుకోసం స్టేషన్ల వద్ద మాస్క్ లను అందుబాటులో ఉంచనున్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఫైన్ కూడా వేయాలని నిర్ణయించారు అధికారులు.

అలాగే ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తులను మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతిస్తారు. ప్రతి స్టేషన్లో థర్మల్ స్క్రీనింగ్ ఎర్పాటు చేయనున్నారు. స్టేషన్ ఎంట్రీ ప్రాంతాల్లో ఫెడల్ టైప్ శానిటైజర్ ను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులతో దగ్గరగా ఉండే సిబ్బందికి..., సెక్యూరిగార్డులకు పిపిఈ కిట్స్, శానిటైజర్స్ అందించనున్నారు. ఇక క్యాష్‌ లెస్ విధానాన్ని ఎంకరేజ్ చేసే విదంగా మెట్రో స్మార్ట్ కార్డు..., మొబైల్ క్యూఆర్ టికెట్, ఆన్ లైన్ ట్రాన్జక్షన్స్ ను ఉపయోగించుకునే అవకాశం పెంచుతామంటున్నాయి మెట్రో వర్గాలు. అలాగే మెట్రో ల్లో ఆక్సిజన్ తగినంతగా ఉండేలా స్టేషన్లలో గతంలో కంటే ఎక్కువ సేపు మెట్రోను నిలిపి ఉంచుతామన్నాంటున్నారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story