Musi Floods 113 Years : ఆ భీకర వర్షానికి 113 ఏళ్ళు..!

Musi Floods 113 Years : ఆ భీకర వర్షానికి 113 ఏళ్ళు..!
Musi Floods 113 Years : అది 1908 సెప్టెంబర్ 28.. సోమవారం.. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. నెమ్మదిగా గాలులు మొదలయ్యాయి.

Musi Floods - 113 Years : అది 1908 సెప్టెంబర్ 28.. సోమవారం.. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. నెమ్మదిగా గాలులు మొదలయ్యాయి.. సన్నగా చినుకులు కురవడం మొదలైంది. ఓ మోస్తరు వర్షం పడుతుందేమోలే అనుకున్నారు. చిటపట చినుకులు కాస్త పెద్దవయ్యాయి. వర్షం నెమ్మదిగా పెద్దదైంది.. చూస్తుండగానే భీకరంగా మారింది. కళ్లముందే ఆ వాన కాస్తా భయంకరమైన వర్షమైంది. ఏకధాటిగా కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. హైదరాబాద్ మునిగిపోతుందా అన్నట్టు వాన కురిసింది. మూసీ నది చుట్టూ ఉన్న చెరువులన్నీ పొంగిపొర్లాయి. చెరువులన్నీ కట్టలు తెంచుకోవడంతో మూసీ నదికి వరద ప్రవాహం పోటెత్తింది

నాలుగు అడుగుల ఎత్తుతో ప్రవహించే మూసీ నదికి వరద రావడంతో.. నీటిమట్టం కొద్ది గంటల్లోనే ఏకంగా 20 అడుగులకు చేరుకుంది. మూసీ పొంగి ప్రవహించడంతో వర్షపు నీరంతా రోడ్లపైకి వచ్చింది. వీధులన్నీ చెరువులను తలపించాయి. ఆ నీరంతా నెమ్మదిగా ఇళ్లలోకి చేరింది. ఊరూవాడా నీరైంది.క్షణక్షణానికి పరిస్థితి భయంకరంగా మారింది. వాన ఆగడం లేదు. మూసీ ప్రవాహం తగ్గడం లేదు. రోడ్లపై నీటిమట్టం పెరుగుతూనే ఉంది.హైదరాబాద్ లో ఉన్నవారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ఈ వర్షం వేలమందిని పొట్టనపెట్టుకోవడం ఖాయం అని వారికి అర్థమైంది వారి భయమే నిజమైంది.

ఆ వరద బీభత్సానికి 48 గంటల్లో 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది వరదలో కొట్టుకుపోయారు. 80 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.లక్షన్నర మందికి గూడు లేకుండా పోయింది. వందలకొద్దీ చెట్లు నెలకొరిగాయి. కొందరైతే భవనల పైకి వెళ్లి తమ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేశారు. తాము బతికుంటామో లేదో తెలియదు అందుకే ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయారు. అలాంటివారిలో కొంతమంది ప్రాణాలను కాపాడింది. ఒక చింత చెట్టు. అది ఇప్పటికీ ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది. వరదల సమయంలో ఆ చింతచెట్టుపై ఎక్కి 150 మందికిపైగా ప్రాణాలను కాపాడుకున్నారు. వరదల సాక్షిగా

వందల మంది ప్రాణాలు కాపాడిన చెట్టు ఇప్పటికీ సజీవంగానే ఉంది. రెండు రోజుల పాటు వారు తిండితిప్పలు లేకుండా అలాగే ఉండిపోయారని చెబుతారు. ఆ చెట్టుకు 400ఏళ్లనాటి చరిత్ర ఉందని భావిస్తున్నారు.వరద బాధితులకి రాజభవనంలో ఆశ్రయాన్ని కల్పించారు. దాదాపుగా రెండువారాల పాటు వంటశాలలు ఏర్పాటు చేశారు. ఈ వరదలకి భాగ్యనగరం.. మనషులను, ఆస్తిపాస్తులనే కాకుండా ఎనలేని చారిత్రక ప్రాధాన్యమున్న అపార వారసత్వ సంపదను కూడా కోల్పోయింది. మూసీ వరద ధాటికి అత్యద్భుతమైన భవనాలు నాశనమయ్యాయి.

ఆ పరిస్థితిని ప్రజలను చూసి అప్పటి పాలకుడైన నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ చలించిపోయారు. నిరాశ్రయుల కోసం అనేక సహాయక చర్యలు చేపట్టారు. వారి సంస్థానాల్లోని భవనాల్లో ఆశ్రయం కల్పించారు. అనేక ప్రాంతాల్లో వైద్య, అన్నదాన శిబిరాలు ఏర్పాటుచేశారు. మళ్ళీ ఇలాంటి పరిస్థితి నగరవాసులకి రాకూడదని ఆనాటి సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పిలిపించి రెండు జలాశయాలను నిర్మించాలని, డ్రైనేజీ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలనీ సూచించారు. నగారాభివృద్ధికి మోక్షగుండం.. ప్రణాళికను తయారుచేశారు. వరదల పునరుక్తిని నివారించడానికి, నగరంలో ఇతర మౌలిక పౌరసౌకర్యాలను మెరుగుపరడానికి కొన్ని సూచనలు చేశారు.

1909, అక్టోబరు 1న తన నివేదికను సమర్పించారు. మోక్షగుండం సూచనల మేరకు 1920లో మూసీ నదిపై నగరానికి పది మైళ్ళ ఎగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను, 1927లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయాన్ని నిర్మించారు. ఈ రెండు జలాశయాలు.. మూసీ నదికి వరదలను నివారించడంతో పాటు హైదరాబాదు నగరానికి తాగునీటిని అందిస్తున్నాయి. అంతటి భీభత్సం సృష్టించిన ఆ వరదలకి 28 సెప్టెంబర్ 2021తో 113 ఏళ్ళు పూర్తయ్యాయి. ఆ క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. కానీ అప్పటి జలాశయాలు, మురుగునీటి వ్యవస్థే.. ఇప్పటికీ భాగ్యనగరంలో ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story