HYD POLICE: డ్రగ్స్‌ దందాపై ఉక్కుపాదం

HYD POLICE: డ్రగ్స్‌ దందాపై ఉక్కుపాదం
భూ మాఫియా ఆట కట్టిస్తామన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌

డ్రగ్స్‌ దందాపై ఉక్కుపాదం మోపుతామని... భూ మాఫియా ఆటకట్టిస్తామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నేర గణాంకాలను వెల్లడించారు. 2022తో పోలిస్తే 2023లో నేరాలు రెండు శాతం పెరిగాయని తెలిపారు. పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ ప్రమేయం లేకుండా చూస్తామని.. అలా లేఖలు తెచ్చే పోలీసులకు పదోన్నతులు ఆపేస్తామని సీపీ శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వార్షిక నేర గణాంకాలను సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. 2022తో పోలిస్తే ఈ ఏడాది 2శాతం నేరాలు పెరిగాయి. మహిళలపై నేరాలూ ఎగబాకాయి. సైబర్‌ నేరాలు 2022లో 292 కేసులు రాగా.. ఈ ఏడాదిలో 344 కేసులు నమోదైనట్లు సీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆర్థిక నేరాలు, భూ ఆక్రమణ కేసుల పెరిగాయని రాబోయే రోజుల్లో ఇలాంటి నేరాలపై ఉక్కుపాదం మోపుతామని సీపీ శ్రీనివాస్‌రెడ్డి తేల్చి చెప్పారు.


హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను ఉపేక్షించేది లేదని శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. మాదకద్రవ్యాల కట్టడికి నార్కోటిక్ బ్యూరో కృషి చేస్తోందన్నారు. డ్రగ్స్‌ను గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్‌ను వినియోగిస్తున్నామని... కొత్త సాంకేతితను పెంచుకుంటామని వివరించారు పోలీసుల పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ ప్రమేయం లేకుండా చూస్తామని సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేరాల్లో ప్రమేయం ఉన్న 8మంది పోలీసులపై ఈ ఏడాది కేసులు నమోదు చేశామని... ఏడుగురిని ఉద్యోగంలోంచి తీసేశామని వివరించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈఏడాది 63 శాతం నేరస్థులకు శిక్షలు పడ్డాయన్న సీపీ ఇందులో 13మందికి జీవిత ఖైదు పడిందని తెలిపారు. కొత్త సంవత్సర వేడుకలు రాత్రి ఒంటి గంట లోపే జరుపుకోవాలని... నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

అసెంబ్లీ ఎన్నికలు సహా ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించాం. చాలా కాలం తర్వాత ఈ ఏడాది గణేశ్‌ నిమజ్జనోత్సవం, మిలాద్‌ ఉన్‌ నబీ ఒకేసారి రావడంతో మత పెద్దల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించాం. ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయి. మహిళలపై అత్యాచార కేసులు 2022లో 343 ఉంటే.. ఈ ఏడాది 403 నమోదయ్యాయి. సైబర్‌ నేరాలు 11 శాతం పెరిగాయి. గతేడాది సైబర్‌ నేరాల్లో రూ.82 కోట్ల మోసాలు జరిగితే, ఈసారి రూ.133 కోట్లను కేటుగాళ్లు కాజేశారు. ఆర్థిక నేరాలపై 2022లో 292 కేసులు నమోదైతే.. 2023లో స్పల్పం (344)గా పెరిగాయి. పోక్సో కేసులు 12 శాతానికి తగ్గాయి. డ్రగ్స్‌ నిర్మూలనకు నార్కోటిక్‌ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది. సరఫరా చేసే వాళ్లు ఎక్కడ ఉన్నా పట్టుకుంటాం. డ్రగ్స్‌ను గుర్తించేందుకు స్నిపర్‌ డాగ్స్‌ను వినియోగిస్తాం. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నాం’’ అని సీపీ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story