Top

వర్షం తగ్గినా.. హైదరాబాద్‌లో తగ్గని వరద ప్రభావం

వర్షం తగ్గినా.. హైదరాబాద్‌లో తగ్గని వరద ప్రభావం
X

వర్షం తగ్గినా హైదరాబాద్ నగరంలో వరదప్రభావం తగ్గలేదు. ఇప్పటికీ అనేక కాలనీలో వరదలోనే ఉన్నాయి. చాలాప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగడానికి నీరు,తినడానికి ఆహారం లేక నీటిలో చిక్కుకున్న జనం అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెరువులకు గండ్లుపడి ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సెల్లార్లలో భారీగా నీరు చేరడంతో ఎవరూ ప్లాట్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. మరోవైపు వరద నీటిలో చిక్కుకున్నవారిని బయటకు తీసే సహాయక చర్యలను ఎన్డీఆర్ ఎస్ బృందాలు కొనసాగిస్తున్నాయి. బోట్ల సహాయంతో వారిని రక్షిస్తున్నాయి.

భారీ వర్షాలకు రాజేంద్రనగర్‌లోని బండ్లగూడా జాగీరు మున్సిపల్‌ కార్పోరేషన్‌ సన్‌సిటీ కాలనీలో ఓ కుటుంబం వరదలో చిక్కుకుంది. 8మంది కుటుంబ సభ్యులు వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఐతే స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. తాడు సహాయంతో ఒక్కొక్కరిని సురక్షితంగా కాపాడారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టైంది.

సరూర్‌నగర్‌ చెరువుకు వరద పోటెత్తడంతో.. చుట్టుపక్కల కాలనీలను ముంచెత్తింది. చెరువు కట్ట కిందనే ఉండే కోదండరాం నగర్‌... నాలుగు రోజుల అనంతరం మెల్లిమెల్లిగా కోలుకుంటోంది. నాలుగు రోజులుగా నీళ్లలోనే బతికామని.. కనీసం మంచినీరు దొరకని పరిస్థితిని ఎదుర్కొన్నామని... స్థానికులు వాపోతున్నారు.

ఇక అటు పీఎన్‌టీ కాలనీ వాసులైతే... ఆనాటి భారీ వరదను ఇంకా మరచిపోలేక పోతున్నారు. ఇప్పటికీ కాలనీ మొత్తం జలమయంగానే ఉంది. ఏ నాయకుడూ తమను పట్టించుకోలేదని... పట్టెడు అన్నం పెట్టే నాథుడు కూడా లేకుండా పోయాడని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు హెచ్చరిక లేకుండా నీరు విడుదల చేశారని పీఎన్‌టీ కాలనీ వాసులు మండిపడుతున్నారు.

హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ పర్యటించారు. వరద ప్రాంతాల్లో ప్రజలకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదని... ప్రభుత్వంపై మండిపడ్డారు. హైదరాబాద్ వాసులు వరద నీటిలో మగ్గిపోతుంటే సీఎం ఎందుకు పర్యటించడం లేదని డి.కె. అరుణ ప్రశ్నించారు.

ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌ జనప్రియ అపార్ట్‌మెంట్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తగ్గినా.. ఇంకా వరద, బురద నుంచి తిప్పలు తప్పడం లేదని బాధితులు వాపోతున్నారు. కనీసం పిల్లలకు పాలు, తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్నామన్నారు. స్తానిక ప్రజాప్రతినిధులు సహాయక చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం కురిసిన కుంభవృష్టికి.. ఇంకా పలు కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. హబ్సిగూడలోని పలు కాలనీవాసుల ఇబ్బందులు ఇంకా తీరలేదు. ఇళ్లు, రహదారులు నీట మునిగి బయటికి వెళ్లాలంటేనే కష్టంగా మారింది.

చాదర్‌ఘాట్‌లో మూసీనది పరిసర కాలనీల రోడ్లు, ఇళ్ల లోపల కొండలా వ్యర్ధాలు పేరుకుపోయాయి. బాలాపూర్‌ చెరువు గండి పడటంతో ఉప్పుగూడ, శివాజీనగర్‌, ఛత్రినాక, జంగంమెట్‌ ప్రాంతాలకు వరద ప్రవాహం పోటెత్తింది. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉంది. మూసీ పరిసర ప్రాంతాలైన ఓల్డ్‌ మలక్‌పేట, శంకర్‌నగర్‌, మూసానగర్‌, కమలానగర్‌, వినాయక్‌నగర్‌, అఫ్జల్‌నగర్‌, పద్మానగర్‌లో భారీగా బురద పేరుకుపోయింది. ఇక నాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోని లక్ష్మీబాగ్‌ కాలనీలో వరద నీరు అలాగే ఉంది. మల్లేపల్లి మాన్‌గార్‌ బస్తీ, అఫ్జల్‌సాగర్‌ కాలనీలో ఇళ్లు ఇప్పటికీ వరదనీటిలోనే ఉన్నాయి.

Next Story

RELATED STORIES