హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు MLC ఫలితంపై ఉత్కంఠ

హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు MLC ఫలితంపై ఉత్కంఠ
ప్రస్తుతానికి TRSకే ఆధిక్యం కనిపిస్తోన్నా విజయం ఇప్పుడప్పుడే ఖరారయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు MLC స్థానంలో ప్రస్తుతానికి TRSకే ఆధిక్యం కనిపిస్తోన్నా విజయం ఇప్పుడప్పుడే ఖరారయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికి 5 రౌండ్లు కౌంటింగ్ పూర్తయ్యింది. TRS అభ్యర్థి సురభి వాణిదేవికి 36 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. ఐతే.. విజయం సాధించాలంటే ఇది సరిపోదు. మొత్తం పోలైన ఓట్లు 3 లక్షల 57 వేల 354 ఉంటే వాటిల్లో సగానికంటే ఒక్కటైనా ఎక్కువగా రావాలి. ఐతే.. ఇప్పటి వరకూ 5 రౌండ్లలో 2 లక్షల 80 వేల 30 ఓట్లు లెక్కించారు. ఇక లెక్కించాల్సినవి 77 వేల 310 ఓట్లు మాత్రమే. ఐతే.. ఇవన్నీ ఏకపక్షంగా TRSకు పడే అవకాశాలు లేవు కాబట్టి రెండో ప్రాధాన్యతకు వెళ్లాల్సిందే. అప్పుడు ఫలితం రావడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంటుంది.

తొలి ప్రాధాన్యత ఓట్లలో ట్రెండ్ బట్టి చూస్తే TRSకు సరాసరిన 33 నుంచి 35 శాతం ఓట్లు వస్తున్నాయి. ఇప్పుడు రెండో ప్రాధాన్యతకు వెళ్లే అక్కడ ఓ 17 శాతం ఓట్లు సాధిస్తే సురభి వాణిదేవి విజయం ఖాయమవుతుంది. ఐతే.. సుదీర్ఘంగా సాగే ఓట్ల లెక్కింపులో తుది ఫలితం ఎలా ఉంటుంది. అనూహ్యంగా రెండో ప్రాధాన్యతలో అభ్యర్థుల తలరాతలు మారతాయా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకూ వెల్లడైన 5 రౌండ్లలో కలిపి వాణీదేవికి 88 వేల 304 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 81 వేల 749 ఓట్లు వచ్చాయి. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 42 వేల 604 ఓట్లు పడితే కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 24,440 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో రౌండ్‌లో దాదాపు 7 శాతం చెల్లని ఓట్లు వస్తుండడంతో ఆ ఎఫెక్ట్ ఏ అభ్యర్థిపై పడుతుందోననే టెన్షన్ కూడా కనిపిస్తోంది. ఒకే నంబర్ ఇద్దరికి వేయడం, బ్యాలెట్ పేపర్‌పై రాయడం లాంటి తప్పులు, పేపర్ మడత పెట్టే క్రమంలో జరిగే పొరపాట్లు లాంటివన్నీ ఇన్‌వ్యాలీడ్ ఓట్లు ఎక్కువగా ఉండడానికి కారణం అవుతున్నాయి. మరోవైపు చెల్లని ఓట్లను పక్కకుపెట్టే క్రమంలో ఏజెంట్ల అభ్యంతరాలతో తిరిగి పరిశీలించడం వంటి వాటి వల్ల టైమ్ వేస్ట్ అవుతోంది. జంబో సైజ్‌లో ఉన్న బ్యాలెట్‌లో ఓట్లను లెక్కించడానికి ఒక్కో ఓట్‌కు సరాసరిన 3 నుంచి 5 నిమిషాలు పడుతోంది.


Tags

Read MoreRead Less
Next Story