HYDERABD: వినాయక నిమజ్జనానికి చురుగ్గా ఏర్పాట్లు

HYDERABD: వినాయక నిమజ్జనానికి చురుగ్గా ఏర్పాట్లు
అన్ని శాఖలతో పోలీసుల సమన్వయం.... శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సారి భాగ్య నగరంలో రికార్డుస్థాయిలో ప్రతిమలు ఏర్పాటు చేయడంతో.. నిమజ్జన ఉత్సవాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే పలు విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభం కాగా పోలీసులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వినాయక నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నీ పండుగలను దృష్టిలో ఉంచుకొని పురాణాపూల్‌ నుంచి లంగర్‌హౌస్‌ వరకు వంద ద్విచక్రవాహనాలతో పోలీసులు ర్యాలీ నిర్వహించారు.


గణేశ్‌ నిమజ్జనం కోసం హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం ఏర్పాట్లు, రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసేందుకు విగ్రహాలను ప్రతిష్టించడానికి ముందే నిర్వాహకులతో ఇంటిమేషన్‌ ఫామ్‌ తీసుకున్నట్లు రాచకొండ CP చౌహాన్‌ తెలిపారు. బందోబస్తు కోసం జిల్లాల నుంచి భారీగా పోలీసులను నగరానికి రప్పించారు. రాచకొండ పరిధిలోని 56 చెరువుల వద్ద నిమజ్జనం ఏర్పాట్లతో పాటు 228 పికెట్‌ ఏరియాలను ఏర్పాటు చేసినట్లు CP వివరించారు.

పెద్ద విగ్రహాలకు ఒక కానిస్టేబుల్‌, హోంగార్డులతో భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తుల కోసం మొబైల్‌ టాయిలెట్స్‌, మెడికల్‌ బృందాలతో పాటు, మహిళా భద్రత కోసం షీటీమ్స్‌, మఫ్టీ పోలీస్‌లతో రంగంలోకి దించినట్లు వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి ఐడియల్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను CPస్టీఫెన్‌ రవీంద్ర పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని ప్రజలు సహకరించాలని సూచించారు. భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించుకోవాలని DJలు పెట్టడం తగ్గించుకోవాలని హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ కోరారు.


నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి అసెంబ్లీ, డివిజన్ కన్వీనర్లు, గణేశ్‌ మండప నిర్వాహకులు, హైదరాబాద్‌ CP సీవీ ఆనంద్‌, రాచకొండ CP చౌహన్‌, GHMC, HMDA రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నిమజ్జనం రోజు చేపట్టాల్సిన పనులను ఉత్సవ కమిటీ సభ్యులు ఆయా శాఖల దృష్టికి తీసుకెళ్లారు.

జిల్లాల్లోనూ నాయకుడిని గంగమ్మ చెంతకు చేర్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. కరీంనగర్‌లో గజాననుడి నిమజ్జన ఏర్పాట్లపై మంత్రి గంగుల కమలాకర్‌, MP బండి సంజయ్‌ పరస్పరం విమర్శలు గుప్పించుకొన్నారు. నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు చేయకుండా తూతూ మంత్రంగా సమీక్షలతోనే సరిపెట్టారని సంజయ్‌ ఆరోపించగా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి గంగుల వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story