ప్రభుత్వ స్థలంలో పేదల గుడిసెలు

ప్రభుత్వ స్థలంలో  పేదల గుడిసెలు
ప్రభుత్వ హామీ ఇచ్చేదాక కదిలేది లేదంటున్న ప్రజలు

గూడు కోసం తరలి వచ్చిన 5 జిల్లాల పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరు వేలకుపైగా చీరలతోనే గుడిసెలు వేసుకుని ప్రభుత్వ స్థలాన్ని తమ సొంతం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. జగిత్యాల సమీపంలోని TRనగర్‌, రాజారం శివారులోని ప్రభుత్వ భూమిలో గుడిసెలను ఏర్పాటు చేసుకుంటుండగా... రోజు రోజుకూ ఈ సంఖ్య మరింత పెరిగిపోతోంది.

జగిత్యాల శివారులోని TRనగర్‌, రాజారం శివారులోని గుట్ట వద్ద దాదాపు 200 నుంచి 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో CPM జెండాలు పాతి పేదలను గుడిసెలు వేసుకునేలా ప్రొత్సహిస్తున్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తున్న విషయం తెలుసుకున్న పేదలు జగిత్యాల, కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చి గుడిసెలు వేసుకుని... స్థలాన్ని సొంతం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. గత రెండు నెలలుగా గుడిసెలు వేసుకుంటుండగా.. వారం రోజులుగా జనం భారీగా తరలి వస్తున్నారు. ఆటోలు, RTC బస్సుల్లో తరలి వస్తున్నారు. వేలాది మంది తరలి రావటంతో రాజారం శివారు గుట్ట జనంతో నిండిపోయింది. కొందరు అక్కడే రాత్రి కూడా ఉంటుండగా.. మరికొంత మంది రోజంతా అక్కడే ఉండి రాత్రి ఇంటికి వెళ్తున్నారు.

గత ప్రభుత్వం తమకు ఇళ్లు ఇవ్వలేదని.. గూడు లేకనే వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్నామని అంటున్నారు. తమకు ఎలాంటి ఆధారం లేదని.. ప్రభుత్వం తమ వివరాలు సేకరించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఆధార్‌ కార్డులు పట్టుకుని స్థలం వద్దకు చేరుకుంటున్న వారితో... సందడి నెలకొంది. హోటళ్లు కూడా వెలిచాయి. విద్యుత్‌ కనెక్షన్‌, సౌకర్యాలు లేకపోయినా రాత్రి కూడా చిన్న పిల్లలతో కలిసి అక్కడే గడుపుతున్నారు. ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని సమాచారంతో.. రోజు రోజుకు రద్దీ పెరగనుండటంతో అధికారులు వారికి ఒక హామీ లాంటిది ఇస్తే బాగుంటుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story