KCR: నేటి నుంచి మళ్లీ కేసీఆర్‌ ప్రచారం

KCR: నేటి నుంచి మళ్లీ కేసీఆర్‌ ప్రచారం
నేడు అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభలు... కేసీఆర్‌ ప్రసంగంపై ఉత్కంఠ

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రెండో విడత ప్రచారం నేడు ప్రారంభం కానుంది. అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ఇవాళ గులాబీ దళపతి ప్రజా ఆశీర్వాద సభలు జరగనున్నాయి. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో KCR పర్యటించనున్నారు. నేటి నుంచి నవంబరు 9 వరకు 35 సభల్లో ఆయన పాల్గొననున్నారు. KCR భరోసా పేరిట మెనిఫెస్టోను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. 100 నియోజకవర్గాల్లో ప్రచారం లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ దళపతి రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. నేటి నుంచి నవంబరు 9 వరకు KCR 35 సభల్లో ప్రసంగించనున్నారు . నేడు అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. ఈనెల 15న పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన KCR.. అభ్యర్థులకు B ఫాంలు ఇచ్చి అదే రోజున ప్రచారంలోకి దిగారు. రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున.. ఈనెల 18 వరకు హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్ధిపేట, జడ్చర్ల, మేడ్చల్ లో సభలు పూర్తి చేశారు.


బతుకమ్మ, నవరాత్రులు, దసరా పండగ దృష్ట్యా మధ్యలో విరామం ఇచ్చిన KCR... నేటి నుంచి రెండో విడత ప్రచారానికి బయలుదేరనున్నారు. నేడు అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో సభలు నిర్వహించి.. శుక్రవారం పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేటలో..శనివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు సభల్లో KCR పాల్గొంటారు. ఈనెల 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్, 31న హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో... ప్రజాశీర్వాద సభలు జరగనున్నాయి. నవంబరు 1న సత్తుపల్లి, ఇల్లందు.... 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి 3న భైంసా, ఆర్మూర్, కోరుట్లలో KCR సభలు నిర్వహిస్తారు. నవంబరు 5న కొత్తగూడెం, ఖమ్మం, 6న గద్వాల, మక్తల్, నారాయణపేట, 7వ తేదీన చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో KCR ప్రచార సభల్లో ప్రసంగించనున్నారు.


నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డిలో KCR నామినేషన్లు వేస్తారు. అదే రోజున కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రజాశీర్వాద సభలకు భారాస భారీగా జనసమీకరణ చేస్తోంది. ప్రతీ సభకు కనీసం లక్ష మందిని తరలించేలా లక్ష్యంగా పెట్టుకుంది. KCR ఏ ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారనే ఆసక్తి భారాస శ్రేణుల్లో నెలకొంది. రెండో విడత ప్రచారం, ప్రసంగాల్లో మరింత దూకుడు పెంచుతారని గులాబీ పార్టీ వర్గాల అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్, భాజపా జాతీయ నేతలు సైతం రానున్నందున.. KCR వాడి వేడి అస్త్రాలతో వాగ్బాణాలు వదిలే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story