REVANTH: మా సర్కార్‌ జోలికొస్తే మాడి మసైపోతారు

REVANTH: మా సర్కార్‌ జోలికొస్తే మాడి మసైపోతారు
నేను జైపాల్‌రెడ్డి, జానారెడ్డినికాదు... చూస్తు ఊరోకోను... ప్రతిపక్షాలకు రేవంత్‌రెడ్డి హెచ్చరిక

కాంగ్రెస్‌పై చెయ్యేస్తే చూస్తూ ఊరుకోవటానికి తాను జైపాల్‌రెడ్డి, జానారెడ్డిని కాదని... తమ ప్రభుత్వం జోలికొస్తే మాడి మసైపోతారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. డిసెంబర్‌లో కేసీఆర్‌ను గద్దె దించామని ఇక మోదీని దించే సమయమొచ్చిందన్నారు. మెదక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ ర్యాలీలో పాల్గొన్న సీఎం... నియోజకవర్గంలో నాడు ఇందిరాగాంధీ గెలుపు, చేసిన అభివృద్ధిని వివరించారు. రుణమాఫీ చేయటమే కాకుండా రైతులకు బోనస్‌ ఇచ్చితీరుతామని పునరుద్ఘాటించారు.

లోక్‌సభ ఎన్నికల్లో 14స్థానాల్లో గెలుపే లక్ష్యమంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... బహిరంగ సభలు, రోడ్‌షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ నిర్ణయం మేరకు అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సీఎం... ఇదే సందర్భంలో ర్యాలీలు, సభలకు హాజరవుతూ, శ్రేణులను ఉత్తేజపర్చుతున్నారు. మెదక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు నిర్వహించిన భారీ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించిన సీఎం... నాడు మెదక్‌ ఎంపీగా ఇందిరమ్మ ఏర్పాటు చేసిన పరిశ్రమల కారణంగానే నేడు దేశ నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి ఉపాధి కోసం వస్తున్నారని అన్నారు. పదేళ్ల మోదీ, కేసీఆర్‌ పాలనలో మెదక్‌ ప్రాంతానికి చేసిందేంటని ప్రశ్నించారు. కేంద్రం నుంచి దుబ్బాకకు నిధులు తెస్తానన్న రఘునందన్‌ తెచ్చిందేంటో చూపించాలన్న సీఎం.... ఖాసీం రిజ్వీలాంటి వెంకట్‌రాంరెడ్డిని బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలబెట్టారని విమర్శించారు.

తమతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న బీఆర్‌ఎస్‌ అధినేత వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం జోలికొస్తే చూస్తూ ఊరుకోటానికి తాను జానారెడ్డి, జైపాల్‌రెడ్డిని కాదన్నారు. మెదక్‌ చర్చి, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించిన సీఎం... వచ్చే వరి పంటకు 500రూపాయల బోనస్‌ ఇస్తామని ప్రకటించారు.

పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోదీ మోసం చేశారు. మీ బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామన్నారు.. ఒక్క రూపాయి అయినా వేశారా? దిల్లీలో రైతులను చంపిన భాజపాను బొంద పెట్టాలి. మోదీ, కేసీఆర్‌ ఏనాడూ మెదక్‌ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఈ ప్రాంతానికి కేంద్రం ఏదైనా పరిశ్రమ ఇచ్చిందా? మల్లన్నసాగర్‌లో వేల ఎకరాలు గుంజుకున్నది ఎవరో మనకు తెలియదా? ఆనాడు కలెక్టర్‌గా ఉండి పేదల భూములు గుంజుకున్న వ్యక్తే.. నేడు భారాస అభ్యర్థి. కాంగ్రెస్‌పై చెయ్యి వేస్తే మాడి మసైపోతారు. నేను జైపాల్‌రెడ్డి, జానారెడ్డిని కాదు.. జాగ్రత్తగా ఉండాలి. పదేళ్ల ఇక్కడే ఉంటాం.. ఎవరు వస్తారో రండి. కాంగ్రెస్‌ కష్టాల్లో ఉన్నప్పుడు మెదక్‌ ప్రజలు ఇందిరమ్మను గెలిపించారు. ఇందిరాగాంధీ.. హైదరాబాద్‌కు అనేక పరిశ్రమలు కేటాయించారు. బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఇక్రిశాట్‌ను ఇచ్చారు. పేద ముదిరాజ్‌ బిడ్డకు ఎంపీ టికెట్‌ ఇచ్చాం.. గెలిపించే బాధ్యత మీదే’’ అని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పలువురు కాంగ్రెస్‌ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story