అన్నదాతను నిలువునాముంచుతున్న నకిలీ విత్తనాల కేటుగాళ్లు

అన్నదాతను నిలువునాముంచుతున్న నకిలీ విత్తనాల కేటుగాళ్లు
అన్నదాత కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. ఆరుగాలం కష్టించిన అన్నదాతకు చివరికి అప్పులే మిగులుతున్నాయి

అన్నదాత కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. ఆరుగాలం కష్టించిన అన్నదాతకు చివరికి అప్పులే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రకృతి కన్నెర్ర చేస్తుంటే.. మరోవైపు కేటుగాళ్ల మోసాలకు రైతులు విలవిలలాడిపోతున్నారు. కల్తీ విత్తనాలు రైతుల పాలిటశాపంగా మారుతున్నాయి. అధికారుల నిర్లక్ష వైఖరితో కేటుగాళ్లు రెచ్చిపోయి.. అన్నదాతను నిండా ముంచుతున్నారు.

అనుమతులేమీ ఉండవు.. అయినా విత్తనాలు, పురుగుల మందులు తయారు చేస్తారు. ఏకంగా మూడు రాష్ట్రాల్లో సాగుతుంది ఈ దందా. సంగారెడ్డి జిల్లాతో పాటు పొరుగునే ఉన్న కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటుంది. దీనిని క్యాస్‌ చేసుకునే ప్రయత్నం చేస్తోంది నాసిరకం విత్తనాల మాఫియా. సదాశివపేట మండలం ఆత్మకూర్‌ గ్రామంలో ఏకంగా తయారీ కేంద్రమే పెట్టారు. దీనికి తోడు పురుగుల మందులూ తయారు చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఆనంద్‌జైన్‌ అనే వ్యక్తి.. హలమ ట్రేడింగ్‌ పేరుతో ఎరువులు, పురుగుల మందు షాప్‌ నిర్వహిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టిన అధికారులు.. సుమారు మూడు కోట్ల విలువచేసే నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులను సీజ్‌ చేశారు.

నకిలీ దందాను కాపాడే ప్రయత్నమే జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యహారంపై ఆరు నెలల క్రితమే నగేష్‌ అనే రైతు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇక రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన అధికారులు.. ఆనంద్‌జైన్‌పై మాత్రం చర్యలు తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక నష్ట పరిహారం అందకపోవడంతో నగేష్ మరోమారు అధికారులను ఆశ్రయించాడు. తాను గ్రామ పెద్దలకు, అధికారులకు డబ్బులు ఇచ్చానని నగేష్‌కు ఇచ్చేది లేదని వ్యాపారి ఆనంద్ జైన్‌ స్పష్టం చేశారు.

గోదాముల్లో నకిలీ విత్తనాలతో పాటు పురుగుల మందులు కూడా లభించినట్లు తెలుస్తోంది. నల్లటి రసాయనం డ్రమ్ములకొద్దీ ఉంది. వీటితో పాటు గడువు ముగిసిన షాంపులు, శీతల పానీయాలు, పాల ప్యాకెట్లు, మ్యాంగో పౌడర్‌, పాల పౌడర్‌, ఔషధాలతో పాటు బిస్కట్లు లభించాయి. అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా కల్తీ కేటుగాళ్లపై అధికారుల చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే అన్నదాతల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story