మంత్రి ఈటల భూకబ్జా ఆరోపణలపై విచారణ ప్రారంభం..!

మంత్రి ఈటల భూకబ్జా ఆరోపణలపై విచారణ ప్రారంభం..!
మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు. రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఎంత భూమి కబ్జా జరిగిందనే దానిపై విచారణ చేస్తామన్న రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

మాసాయిపేట తహసీల్దార్ మాలతి, రెవెన్యూ సిబ్బందితో పాటు.. విజిలెన్స్‌ ఎస్పీ మనోహర్, డీఎస్పీ ఆనంద్‌ సమక్షంలో విచారణలో పాల్గొంటున్నారు. భూములు తీసుకునే ముందు రైతుల దగ్గరకు ఎవరెవరు వచ్చారు.. ఏ పద్ధతిలో భూములు తీసుకున్నారో వివరాలు సేకరిస్తున్నారు.

మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలో ఈటల తమ భూములు కబ్జా చేశారని ఆ ప్రాంతంలోని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావును అదేశించారు.

సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాథమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో అచ్చంపేటకు చేరుకున్న రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story