Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను ప్రజలకు వివరించండి

Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను ప్రజలకు వివరించండి
కేసీఆర్‌ అవినీతిని గ్రామగ్రామాన చాటాలన్న ముఖ్యమంత్రి

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌కార్యాచరణ సిద్ధం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకుగానూ నిన్న గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి అధ్యక్షతన 'ప్రదేశ్ ఎన్నికల కమిటీ' సమావేశమైంది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించిన నేపథ్యంలోనాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని భారాసకు తెలుసునని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టులను ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించిందంటూ దుష్ట్రచారం చేసి, కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రేవంత్‌రెడ్డి నేతలకు తెలిపారు. మేడిగడ్డ అవినీతిపై విచారణ, కఠిన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండటంతో దీనినుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించారంటూ KCR, భారాస తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ దుష్ర్పచారాన్ని పార్టీ నేతలంతా తిప్పికొట్టాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.


గత భారాస ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్‌ నేతలంతా ఊరూరా గట్టిగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఎంపీ అభ్యర్థులుగా కచ్చితంగా గెలిచే సత్తా ఉన్నవారినే ఎంపిక చేయాలన్న ఆయన... టికెట్ల కేటాయింపులో అన్ని సామాజికవర్గాలకు పార్టీ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించేలా అభ్యర్థుల ఎంపిక, నేతల పనితీరు ఉండాలని చెప్పారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సోనియాగాంధీని పోటీ చేసేలా ఒప్పించాలని పలువురు నేతలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఖమ్మం నుంచి సోనియా, ప్రియాంకగాంధీలు పోటీచేయని పక్షంలో ఆ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని సీనియర్‌ నేత VH సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, కమిటీ నుంచి తీసుకున్న అభిప్రాయాలను మాత్రమే కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలువాలంటే... మరింత బలమైన నేతలను బరిలో దించాలని పలువురు కమిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకొస్తే... ఆహ్వానించాలని అభిప్రాయపడ్డారు.



Tags

Read MoreRead Less
Next Story