కర్ణాటక కాంగ్రెస్ స్ట్రాటజీ...తెలంగాణలో వర్కౌట్ అవుతుందా!

కర్ణాటక కాంగ్రెస్ స్ట్రాటజీ...తెలంగాణలో వర్కౌట్ అవుతుందా!
కర్ణాటకలో ఐదు గ్యారెంటీ స్కీంలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో కూడా గ్యారెంటీ కార్డును ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది.

కర్ణాటక ఫార్మూలనే తెలంగాణలో గెలిపిస్తుందని కాంగ్రెస్ ధీమాగా ఉందా? అక్కడ ప్రకటించినట్టే మేనిఫెస్టోలో ఫ్రీ గ్యారెంటీ స్కీమ్ లను తెలంగాణలో కూడా ప్రకటించాలని భావిస్తోందా? ఇందుకోసం ఆ పార్టీ సీరియస్‌గా కసరత్తు చేస్తోందా? పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి తో పాటు సునీల్ కనుగోలు టీమ్ దీనిపై దృష్టి సారిస్తున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే మెజారిటీ ప్రజలను ఆకర్షించేందుకు టీ-కాంగ్రెస్ పక్కా వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీ స్కీంలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో కూడా గ్యారెంటీ కార్డును ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కర్నాటక ఎన్నికల్లో ఫ్రీ గ్యారెంటీ స్కీమ్ కాంగ్రెస్‌కు ఒక ట్రంప్ కార్డ్ లాగా ఉపయోగపడింది. అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో ముందుగానే మేనిఫెస్టోలో ప్రకటించిన కర్ణాటక కాంగ్రెస్, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, గృహలక్ష్మి పథకం కింద ప్రతి ఇంట్లో ఓ మహిళకు రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యంతో పాటు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. ఇందులో కొన్నింటిని అమలు చేస్తోంది. అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్ సమావేశంలో ఫ్రీ గ్యారెంటీ స్కీమ్ కు నిధులు కేటాంచింది. దీంతో ఏటా 5 వేల కోట్ల భారం పడనుంది. ఈ స్కీం వల్ల కాంగ్రెస్ పార్టీ వైపు కర్ణాటక సామాన్య జనం నిలబడేలా చేసింది.దీంతో తెలంగాణలోనూ ఇలాంటి ఐదు గ్యారెంటీ స్కీంల కోసం వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే పలు డిక్లరేషన్లు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ రానున్న రోజుల్లో మరిన్ని డిక్లరేషన్లు ప్రకటించనుంది. వరంగల్ లో రైతు డిక్లరేషన్, ఇటీవల హైదరాబాద్లో చేసిన యూత్ డిక్లరేషన్ కాంగ్రెస్ కి చాలా ప్లస్ అయింది. త్వరలోనే బీసీ డిక్లరేషన్, మహిళ డిక్లరేషన్ ప్రకటించి సెప్టెంబర్ 17 న పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించేందుకు సిద్దమవుతోంది టీ కాంగ్రెస్.

మేనిఫెస్టోలో 5 గ్యారెంటీ స్కీమ్ లను తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇల్లు కట్టుకునే వారికి ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించనుంది. ఫ్రీ గ్యారెంటీ స్కీమ్ లో ఈ అంశాన్ని పెట్టనున్నట్లు సమాచారం. కేసీఆర్ సర్కార్ రైతుబంధు, రైతు బీమా ఇస్తూ మిగతా రైతు బెనిఫిట్స్ అన్ని తీసేసిందనీ,కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించనుంది. ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెబుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక 200 యూనిట్ల కరెంట్‌ ఫ్రీగా ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇలా పలు అంశాలతో ఐదు గ్యారెంటీ స్కీమ్ లను ప్రకటించి ఆపన్నహస్తం పేరుతో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని భావిస్తోంది కాంగ్రెస్‌.

గ్యారెంటీ కార్డులో ఏ హామీలు ఇస్తే జనం కాంగ్రెస్ వైపు వస్తారనేదానిపై సునీల్ టీం ఎక్స్ పర్ట్ కమిటీతో చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో పలు సార్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఏ హామీ అయినా ప్రజలను ఆకర్షించే విధంగా ఉండాలనేది కాంగ్రెస్ ప్లాన్. ఎన్నికల నాటికి ఆకర్షవంతమైన పథకాలతో గ్యారెంటీ కార్డును సిద్ధం చేసే పనిలో పడింది టీ కాంగ్రెస్.కర్నాటక మాదిరిగానే మేనిఫెస్టోలో ఫైవ్ గ్యారెంటీ స్కీమ్ తో పాటు, కలిసికట్టుగా ఉండడం, ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం,సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు లాంటి తదితర అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. కర్ణాటకలో పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిన స్ట్రాటజీ తెలంగాణలో ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story